- ఎస్సీ కార్పొరేషన్‌లో పెన్షన్ ఫైలుకు ముగ్గురు ఉద్యోగుల బేరం
- ఆర్ అండ్ బీ శాఖలో రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కోసం రూ. 1.20 లక్షలు డిమాండ్
- వరుస వివాదాలపై కలెక్టర్ సీరియస్.. ఎంక్వైరీ కమిటీ ఏర్పాటు
సూర్యాపేట, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కారం కావాల్సిన కలెక్టరేట్ కార్యాలయం అవినీతి బాగోతాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఫైలు కదలాలన్నా.. సంతకం పడాలన్నా చేయి తడపాల్సిందేనన్నట్లుగా కొందరు ఉద్యోగుల తీరు ఉంది.
సామాన్యుల నుంచి తోటి ఉద్యోగుల వరకు ఎవరినీ వదలకుండా అందినకాడికి దండుకుంటున్నారు. ఇటీవల ఒకదాని వెంట ఒకటిగా వెలుగుచూస్తున్న ఉద్యోగుల అక్రమాలు కలెక్టరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఎస్సీ కార్పొరేషన్‌లో పెన్షన్ ఫైలుకు పైసలు!
ఎస్సీ కార్పొరేషన్‌లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన ఓ మహిళా ఉద్యోగి పెన్షన్ ఫైలు క్లియరెన్స్ కోసం సంబంధిత శాఖలో పని చేస్తూ ఇటీవల రిటైర్డ్ అయిన మహిళా అధికారితో పాటు ముగ్గురు ఉద్యోగులు బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేశారు.
సర్వీస్ పూర్తయి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించకుండా డబ్బులు ఇస్తేనే పని ముందుకు సాగుతుందని తేల్చిచెప్పారు. దీంతో సదరు మహిళా ఉద్యోగి కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఉన్నతాధికారులు జరిపిన విచారణలో ఉద్యోగులు లంచం డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, విధుల్లో తీవ్ర అలసత్వం ప్రదర్శించారని తేలింది. విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ అసిస్టెంట్‌రవివర్మ, జూనియర్ అసిస్టెంట్ యాదగిరి, అటెండర్ రాములను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అధికారిపై సైతం సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
రూ. 1.20 లక్షలు డిమాండ్
ఎస్సీ కార్పొరేషన్ వ్యవహారం సద్దుమణగక ముందే తాజాగా రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖలో మరో బాగోతం బయటపడింది. కుటుంబ పెద్దను కోల్పోయినకారుణ్య నియామకం కోసం చేసుకున్న దరఖాస్తు ఫైలును కూడా లంచం కోసం అడ్డుకున్నారు.
ఆర్ అండ్ బీ శాఖలో వాచ్ మెన్ గా పని చేస్తున్న మండపల్లి భరత్ బాబు 2023లో గుండెపోటుతో మృతి చెందాడు. రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ కోసం అదే శాఖలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ భరత్ బాబు కొడుకు నాగేంద్ర బాబు వద్ద రూ.1.20లక్షలు డబ్బులు డిమాండ్ చేశాడు.
అయితే రూ.40వేలు మొదట ఇవ్వగా, మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. అమౌంట్ చెల్లిస్తేనే ఫైల్ క్లియర్ చేస్తా అని చెప్పడంతో మూడేండ్లుగా ఆఫీసు చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తండ్రి ఉద్యోగం కోసం నాగేంద్ర బాబు అప్లయ్ చేసుకున్నా అతనిని కాదని మరో వ్యక్తి దగ్గర రూ.5లక్షలు తీసుకొని నియామకం చేపట్టినట్లు భాదితుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ చేసిన కలెక్టర్ సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు.
పలు శాఖల్లో అవినీతి !
కలెక్టరేట్‌లోని పలు విభాగాల్లో పనిని బట్టి పర్సంటేజీ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి గ్రామాల్లో చేపట్టిన పనుల ఎంబీ రికార్డులు, అంచనాలు, నిధుల మంజూరు ఫైళ్లపై సంతకాల కోసం అధికారులు ఓపెన్‌గానే పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పైసలు ముట్టకపోతే కాంట్రాక్టర్లను నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది, కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ కావాలంటే ట్రెజరీ డిపార్టమెంట్ లో పర్సంటేజీ ఇస్తే గంటల్లో క్లియర్ అవుతాయి.. లేదంటే నెలల తరబడి తొక్కిపెడుతున్నారనే విమర్శలున్నాయి.
వీటితో పాటు విద్యా శాఖలో సైతం ఉపాధ్యాయుల సమస్యలు, జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు, చివరికి ప్రైవేట్ విద్యాసంస్థల రెన్యువల్స్ కోసం ముడుపులు తప్పనిసరి అయినట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లా పంచాయితీ శాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగి పంచాయితీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కోసం ఒక్కొక్కరి దగ్గర రూ.30వేలు వసూళ్లు చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
కలెక్టర్ సీరియస్.. కమిటీ ఏర్పాటు
కలెక్టరేట్ కేంద్రంగా వరుసగా బయటపడుతున్న అక్రమాలు, ఉద్యోగుల వసూళ్ల దందాపై కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని సహించేది లేదని ఆయా శాఖల్లో జరిగిన అక్రమాల బాగోతంపై సమగ్ర విచారణ జరిపేందుకు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనల్లో బాధ్యులైన వారిపై పూర్తి వివరాలు సేకరించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులైన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
