వీకెండ్ వచ్చిందంటే కొత్త సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్ల వైపు చూస్తుంటారు. ఈసారి గాంధీ జయంతి వీకెండ్ కావడంతో అక్టోబర్ 1, 2 తేదీల్లో పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకవైపు క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఉంటే.. మరోవైపు ఫాంటసీ, యాక్షన్, రొమాంటిక్ డ్రామాలు కూడా థియేటర్లలో సందడి చేయనున్నాయి. ముఖ్యంగా విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన ‘సిగ్మా’, ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, అజయ్ దేవగణ్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’తో పాటు కీర్తి సురేశ్ ‘డోరతీ’, నివిన్ పౌలీ ‘సంచారి’, ‘తత్వం’ వంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
‘సంచారి’
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘యెళు కాదల్ యెళు మలై’ తెలుగులో ‘సంచారి’ పేరుతో అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇది రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్. కథలో 8,000 ఏళ్లుగా జీవిస్తున్న అమరుడిగా నివిన్ పౌలీ కనిపించనుండగా.. ఎడారి నుంచి ఇంటికి తిరిగొచ్చిన కుటుంబం కోసం తపించే వ్యక్తిగా సూరి నటించారు. ఓ రైలు ప్రయాణంలో జరిగే అనూహ్య పరిచయం నుంచి కథ కీలక మలుపులు తీసుకుంటుంది.
‘సిగ్మా’
తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ హీస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా కనిపించనుంది. గతంలో నిర్ణయించిన విడుదల తేదీ మారగా.. ప్రస్తుతం ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలోకి రానుంది.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మించారు. ఫాంటసీ, కామెడీ, ఎమోషన్ మేళవింపుతో ఈ సినిమా రూపొందింది. ఓ మ్యాజిషియన్ అనుకోకుండా ఓ చిన్నారిని మాయ చేయడం, ఆ తర్వాత ఆమెకు ఉన్న అసాధారణ శక్తుల కారణంగా ఎదురయ్యే పరిణామాల చుట్టూ కథ సాగుతుంది. అక్టోబర్ 2న తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
అజయ్ దేవగణ్, టబు, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘దృశ్యం’ ఫ్రాంచైజీలో మూడో భాగం. ఈసారి మలయాళ వెర్షన్ కథను యథాతథంగా అనుసరించకుండా పూర్తిగా భిన్నమైన స్క్రీన్‌ప్లేతో రూపొందించినట్లు అజయ్ దేవగణ్ వెల్లడించారు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలోనూ రెండు చిత్రాల మధ్య తేడా ఉండనుంది.
‘తెల్లకాగితం’
‘కోర్ట్’ సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘తెల్లకాగితం’. నక్షత్ర హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో రమేశ్ బండ్రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సమజవరగమన’ ఫేమ్ నందు సవిరిగన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. యూత్‌ఫుల్ ఎమోషన్స్, హార్ట్‌టచింగ్ సన్నివేశాలతో సినిమా ఉండనున్నట్లు చిత్రబృందం చెబుతోంది. అక్టోబర్ 2న థియేటర్లోకి రానుంది.
ALSO READ: బిగ్‌బాస్‌కు పోటీగా 'ద ట్రైటర్స్'..
‘తత్వం’
దినేష్ తేజ్, దష్విక కె. జంటగా నటించిన ‘తత్వం’ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. అర్జున్ కోలా రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఓ వ్యక్తి పెళ్లి సంబంధం కోసం ఓ గ్రామానికి వెళ్లి అక్కడ జరుగుతున్న వరుస హత్యల కేసుల్లో చిక్కుకోవడం ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, ఊహించని మలుపులతో ఈ సినిమా సాగనుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘డోరతీ’
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేశ్, సనంత్, రిషికాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘డోరతీ’. తమిళంలో సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా.. అక్టోబర్ 2న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 1990ల నేపథ్యంలో గ్రామీణ తమిళనాడులో ఇద్దరు స్నేహితుల జీవితాల్లోకి ‘డోరతీ’ అనే మహిళ రావడంతో వారి ఆలోచనలు, సంబంధాలు ఎలా మారతాయన్నది కథకు కేంద్రంగా ఉంటుంది. కుల విభజనలు, హింస, పురుషాధిక్యత, ప్రేమ, అంగీకారం వంటి అంశాలను ఈ సినిమా టచ్ చేస్తుంది.
మొత్తంగా చూస్తే.. అక్టోబర్ 1న ‘సంచారి’, అక్టోబర్ 2న ‘సిగ్మా’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’, ‘తత్వం’, ‘డోరతీ’ వంటి సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. దీంతో ఈ గాంధీ జయంతి వీకెండ్‌లో ప్రేక్షకులకు విభిన్న జానర్ల సినిమాలతో మంచి ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
