వెలుగు స్పెషల్ : సర్కార్ తుమ్మచెట్లు..పర్యావరణ హితమేనా?

వెలుగు స్పెషల్ :  సర్కార్ తుమ్మచెట్లు..పర్యావరణ హితమేనా?

తెలంగాణ  భౌగోళిక  ప్రాంతంలో సర్కారు తుమ్మచెట్టు గురించి  తెలియనివారు లేరంటే అతిశయోక్తి లేదు.  నిజానికి ఈ చెట్టు స్థానిక జాతికి చెందినది కాదు.  అయినప్పటికీ  ఈ ప్రాంత వృక్షంగా  భావించేంతగా అంతర్భాగం అయ్యింది. 

  ఇటీవల  కాలంవరకు  తెలంగాణ  తీవ్ర నీటి ఎద్దడి ప్రాంతం.  కరువు  కాటకాలతో  కునారిల్లిన నేల.  వర్షాభావ  ప్రాంతమైన  తెలంగాణ,  బీడు భూముల నిలయం.  ఈ  బీడు భూములే,  సర్కారు  తుమ్మచెట్లకు నిలయంగా మారాయి.  

ఎక్కడి నుంచో  దిగుమతి అయిన ఈ  చెట్టు పల్లె నుంచి  మొదలు  పట్నం దాకా  తెలంగాణ మొత్తం విస్తరించింది.  ఈ చెట్టు ఎక్కడి నుంచి దిగుమతైంది?  ఈ  తుమ్మకు  సర్కార్ పదాన్ని  ఎందుకు జోడించారు.  ఈ  చెట్టు పర్యావరణ  హితమేనా?  పర్యావరణవేత్తలు  ఏమంటున్నారు?  ఈ చెట్టు వల్ల ఏమైనా  ఆర్థిక  ప్రయోజనాలున్నాయా?  ఒక్కసారి పరిశీలిద్దాం. 

  ఈ చెట్టు పుట్టినిల్లు దక్షిణ  అమెరికా  ప్రాంతంగా భావిస్తారు.  దీని శాస్త్రీయ నామం  ‘ప్రో సో ఫిస్  జూలీఫ్లోర’.  శుష్క ప్రాంతాలు,  ఎడారి నేలల్లో  సైతం ఈ చెట్టు  విస్తరిస్తుంది.  ఎలాంటి వాతావరణ పరిస్థితులైనా  తట్టుకొని నిలబడగలదు.  మేకుల్లాంటి  ముండ్లు ఉండటం వలన దీని జోలికి ఏ జంతువు వెళ్లదు.  

నల్ల తుమ్మతో ప్రయోజనాలు

బ్రిటిష్  వలస  ప్రభుత్వం  కరువు నివారణ చర్యలో భాగంగా ఈ  చెట్టును మొదటగా సింధ్  ప్రాంతంలో 1876లో ప్రవేశపెట్టింది.  ఆ తదుపరి  గుజరాత్,  రాజస్థాన్ నుంచి దక్షిణ భారతం వరకు ఈ  చెట్లను పెంచేలా ప్రభుత్వం రైతులను   ప్రోత్సహించింది.  ఉచితంగా  గింజలను  సరఫరా చేసింది.  ఈ చెట్లను పెంచేలా ప్రోత్సహిస్తూ  ప్రచారం చేసింది.   

అనతి కాలంలోనే  ఈ  చెట్లు ఎల్లెడలా విస్తరించాయి.  ఆనాడే  కొద్దిమంది  పర్యావరణ వేత్తలు,  పరిశోధకులు ఈ  మొక్కను  ప్రోత్సహించడం  సరికాదని,   పర్యావరణానికి  హాని  కలుగజేస్తుందని హెచ్చరించారు.  సర్కారు తుమ్మగా  పిలుస్తున్న ఈ వృక్షం స్థానిక తుమ్మల మధ్య పేరు సారూప్యత తప్ప ఏ  సామీప్యత లేదు.  ఇవి పూర్తిగా  భిన్న జాతి మొక్కలు.  

నల్ల తుమ్మ,   తెల్ల తుమ్మ స్థానిక జాతి మొక్కలు.   సర్కారు తుమ్మ  అతిక్రమణ  జాతి  మొక్క.   అయితే  నల్ల తుమ్మ వల్ల ఆర్థిక ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.   ఇది కలప నుంచి  మొదలు  వంటచెరుకు వరకు ఉపయోగపడుతుంది.   దీని ఆకులు,  కొమ్మలు  పశువులకు  ముఖ్యంగా  గొర్రెలకు, మేకలకు  ఆహారంగా  ఉపయోగపడతాయి.   

సర్కారు తుమ్మ చెట్లతో నేల కలుషితం

సర్కారు తుమ్మ కొమ్మలు వంట చెరుకుగా తప్ప పెద్దగా దేనికీ ఉపయోగపడదు.  వీటిని నరికి రవాణా చేయడం చాలా ఇబ్బంది.  పశువుల నుంచి మనుషుల వరకు సూదుల్లాంటి  మొనదేలిన ముండ్లతో  ప్రమాదం ఉంది.  ఈ ముండ్ల  నుంచి పాదరక్షలు సైతం పాక్షికంగానే  కాపాడగలవు.  

మొనదేలిన ముండ్లు బలంగా గుచ్చుకుంటే  వైద్య సహాయం తప్పనిసరి.  కొన్ని  సందర్బాలలో శస్త్ర చికిత్స అవసరం కలగవచ్చు.  గతంలో పేద ప్రజల నుంచి మొదలు దిగువ,  మధ్య తరగతులవారి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్ల   కొమ్మలు,  రెమ్మలను  వంటచెరుకుగా వాడేవారు. 

 క్రమంగా వంట గ్యాసు  అందుబాటులోకి రావడంతో వంట చెరుకుగానూ  ఈ చెట్టు  ప్రాధాన్యతను కోల్పోయింది.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగు నీటి ప్రాజెక్టులు పెరిగాయి.  నీటి లభ్యత పెరిగింది.  తద్వారా అనేక బీడు భూములు సాగు భూములుగా మారాయి. ఇంకా మారుతూనే ఉన్నాయి.  దీని వల్ల  ‘సర్కారు తుమ్మ’ కు  విస్తరణ  తగుతున్నది. 

 అయినా రోడ్లు,  చెరువుగట్లు,  రైల్వే ట్రాకులు, ఖాళీ స్థలాల్లో పెరిగి పర్యావరణ వ్యవస్థను, భూగర్భ జలాలను హరించి,   నేలను కలుషితం చేసే ఈ సర్కార్  తుమ్మచెట్లపై  ప్రభుత్వం పునరాలోచన చేయవలసి ఉంది.  ఈ క్రమంలో బహుళ  ప్రయోజనాలున్న  స్థానిక తుమ్మ చెట్లను  రక్షించుకోవాలసిన అవసరముంది.

 
- పూల్లూరు జగదీశ్వర్ రావు,పర్యావరణ ప్రేమికుడు

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ [email protected] 
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు
.