హైదరాబాద్: టీజీఐఐసీ (TGIIC) ఆధ్వర్యంలో హార్డ్‌వేర్ పార్క్ కోసం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట సమితి (జేఏసీ), తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సదస్సులో డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహతో పాటు హార్డ్‌వేర్ పార్క్ భూనిర్వాసితులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పార్క్ పేరుతో ఎంతో మంది భూములను కోల్పోయారని తెలిపారు. ఈ సమస్యను స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 2013 భూసేకరణ చట్టం అమల్లోకి రాకముందే కొన్ని భూములను సేకరించిన అంశం ఉందని, దీనిపై మంత్రి శ్రీధర్‌బాబుతో ఇప్పటికే సమావేశమైనట్లు చెప్పారు.
సంబంధిత అధికారులు కాలయాపన చేయడం వల్ల భూనిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కోదండరెడ్డి చెప్పారు. ఇది ప్రత్యేకమైన సమస్య అని, విధివిధానాలను పక్కన పెట్టి భూసేకరణ చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ భూములను పరిశీలించాలని మంత్రి శ్రీధర్‌బాబు కలెక్టర్‌ను ఆదేశించినప్పటికీ, అధికారులు సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు.
22A భూముల అంశంలోనూ సమస్యలు ఉన్నాయని కోదండరెడ్డి అన్నారు. రెవెన్యూ చట్టంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చిన సవరణల నేపథ్యంలో 22A నిబంధనలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు. ఈ నిబంధనలను అమలు చేసే క్రమంలో అధికారుల తప్పిదాలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
భూముల వినియోగంపై పూర్తి వివరాలు సేకరిస్తాం: ఎంపీ చామల
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రొఫెసర్ కోదండరాం, కోదండరెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తాను కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తినేనని తెలిపారు.
హార్డ్‌వేర్ పార్క్ కోసం సుమారు 3 వేల ఎకరాల భూమిని సేకరించినట్లు పేర్కొన్న ఎంపీ.. ఇప్పటివరకు పార్క్ కోసం ఎంత భూమిని వినియోగించారు, ఇంకా ఎంత భూమి మిగిలి ఉందనే వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకుంటానన్నారు.
గతంలో గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో లేఅవుట్లు చేసిన సమయంలో పలువురు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కూడా నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎన్ని లేఅవుట్లు ఉన్నాయి, వ్యవసాయ భూమి ఎంత ఉంది, ప్రభుత్వ భూమి ఎంత ఉందనే వివరాలను పూర్తిగా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సంబంధిత మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించి, ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
భూనిర్వాసితులు అధైర్యపడొద్దు: కోదండరాం
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పార్క్ భూనిర్వాసితుల సమస్యపై పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో సంబంధిత డాక్యుమెంట్లతో కూడిన పూర్తి సమాచారాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి అందజేస్తామని చెప్పారు.
దసరా నాటికి ఈ సమస్యపై మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు కోదండరాం తెలిపారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం జరగాలని, ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలని కోరారు. త్వరలో మంత్రి శ్రీధర్‌బాబును కలిసి సమస్యకు సంబంధించిన వాస్తవాలను వివరిస్తామని చెప్పారు. హార్డ్‌వేర్ పార్క్ భూనిర్వాసితులు అధైర్యపడవద్దని, సమస్య పరిష్కారం అయ్యే వరకు వారి తరఫున ముందుండి పోరాడుతానని ప్రొఫెసర్ కోదండరాం భరోసా ఇచ్చారు.
