దెబ్బతిన్న సీతారామ ప్రాజెక్ట్ కాల్వ లైనింగ్ ..రూ.90 కోట్లతో నిర్మాణం.. రెండేళ్లకే ఖరాబ్..

దెబ్బతిన్న సీతారామ ప్రాజెక్ట్ కాల్వ లైనింగ్ ..రూ.90 కోట్లతో నిర్మాణం.. రెండేళ్లకే ఖరాబ్..
  • రెండేండ్ల కిందే ప్రారంభమైన  రాజీవ్ లింక్ కెనాల్ 

ఖమ్మం, వెలుగు : సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్​కు తరలించేందుకు నిర్మించిన రాజీవ్​లింక్ కెనాల్ పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. కాల్వను ప్రారంభించిన రెండేండ్లలోనే రెండు చోట్ల  కాంక్రీట్ లైనింగ్ దెబ్బతింది. ఇమామ్​ నగర్​దగ్గర సుమారు 20 ఫీట్లకు పైగా కాల్వ లైనింగ్ కుంగిపోగా, కాంక్రీట్ కాస్తా ముక్కలుగా విరిగి కాలువలో పడిపోయింది.

 సమీపంలోనే మరోక చోట బ్రిడ్జి పక్కన కూడా 20 ఫీట్లకు పైగా లైనింగ్ పూర్తిగా పాడైంది. దీంతో మట్టి సైతం కోతకు గురవుతోంది. స్వల్ప నీటి ప్రవాహానికే కాల్వలు దెబ్బతినడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్​ఎస్​ హయాంలో సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వల పనులు పూర్తయినా టన్నెల్స్​నిర్మాణం పూర్తి కాకపోవడంతో కాల్వలను ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయింది. 

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక సుమారు రూ.90 కోట్లతో రాజీవ్​ లింక్​ కెనాల్ ను నిర్మించారు. జూలూరుపాడు మండలం వినోబానగర్​వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరు మండలం అక్కినాపురం తండా సమీపంలోని నాగార్జున సాగర్​ ప్రాజెక్టు 21వ మెయిన్​ బ్రాంచ్​ కెనాల్ వరకు ఈ లింక్​ కెనాల్ ను నిర్మించారు. 

2024 ఆగస్టు 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే 1400 క్యూసెక్కుల కెపాసిటీ ఉన్న కాల్వలో ఇటీవల గోదావరి నుంచి 1700 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడం వల్లే లైనింగ్ దెబ్బతిని ఉండొచ్చని అధికారులు  చెబుతున్నారు.