- బంజారాహిల్స్, కల్యాణ్ నగర్‌లో పైలెట్ ప్రాజెక్టు
- సక్సెస్ అయితే నగరం మొత్తం ‘ఫ్రీ మ్యాన్ సబ్ స్టేషన్లు ’
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో టీజీఎస్పీడీసీఎల్ ఫ్రీ మ్యాన్ సబ్ స్టేషన్ల ఏర్పాటుకు సిద్ధమైంది. డిజిటల్ టెక్నాలజీ, సెన్సార్లతో పని చేసే ఈ సబ్స్టేషన్లు విద్యుత్‌సరఫరాలో లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తి కరెంట్‌పోతే వాటికవే పునరుద్ధరించుకుంటాయి. ఈ నెల చివరి వారంలోగా బంజారాహిల్స్, కల్యాణ్ నగర్ లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో రాష్ట్రంలో 1,733కి పైగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఉండగా హైదరాబాద్ లోనే 520 కి పైగా ఉన్నాయి. పైలట్ప్రాజెక్ట్సక్సెస్అయితే, నగరమంతా ఈ తరహా స్మార్ట్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు.
మనుషులు లేకుండా ఎలా..
సాధారణంగా సబ్ స్టేషన్లలో స్విచ్‌లు ఆన్, ఆఫ్ చేయడం నుంచి ప్రతి సమస్యనూ పర్యవేక్షించడానికి ఆపరేటర్లు, సిబ్బంది అవసరముంటుంది. ముగ్గురు నలుగురితోనే పనైపోతుంది. కానీ, ఈ ఫ్రీ మ్యాన్ సబ్ స్టేషన్లు పూర్తిగా డిజిటల్ టెక్నాలజీ, సెన్సార్లతో పనిచేస్తాయి. ఏదైనా ప్రాంతంలో లైన్ ట్రిప్ అయితే లేదా టెక్నికల్ లోపం తలెత్తితే, ఈ డిజిటల్ వ్యవస్థ కొన్ని సెకన్లలోనే ప్రత్యామ్నాయ లైన్ ద్వారా కరెంట్ ను పునరుద్ధరిస్తుంది. అత్యవసర సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ ను రంగంలోకి దించుతారు.
ప్రయోజనం ఏంటి ?
కరెంట్పోయిన సెకన్లలోనే వస్తుంది కాబట్టి గంటల తరబడి నిరీక్షణకు కాలం చెల్లినట్టే..మానవ పొరపాట్లకు తావుండదు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సిబ్బంది కొరత వేధిస్తుండగా ఈ ఫ్రీ మ్యాన్ సబ్ స్టేషన్లతో మ్యాన్ పవర్ ఇబ్బందులకు చెక్ పెట్టొచ్చు. క్యూర్ పరిధిలోని విద్యుత్ సర్కిళ్లలో 800 పైగా ఆర్టిజన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీంతో పాటు సబ్ స్టేషన్ ఆపరేటర్, లైన్ మెన్, పోల్ ఆపరేటర్, జేఎల్‌ఎం, పోస్టులు కూడా ఖాళీనే..ఇప్పటికిప్పుడు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే ప్లాన్ లేకపోవడంతో ఫ్రీ మ్యాన్ సబ్ స్టేషన్లకు టీజీఎస్పీడీసీఎల్ ప్లాన్చేసింది. సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల నియామకాలు కూడా లేకపోవడంతో సబ్ స్టేషన్ల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యా పరిష్కారమవుతుందని టీజీఎస్పీడీసీఎల్ భావిస్తోంది.
స్కాడా మెయిన్ రోల్
స్కాడా (సూపర్ వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విసిషన్) అనేది పవర్సిస్టమ్స్ను దూరం నుంచే పర్యవేక్షించడంతో పాటు నియంత్రించే ఒక అధునాతన కంప్యూటరైజ్డ్ సాంకేతిక వ్యవస్థ. ఇది మనుషుల ప్రమేయం లేకుండా విద్యుత్ లోపాలను గుర్తిస్తుంది. కంట్రోల్ రూమ్ నుంచి ఇది పని చేస్తుంది. ప్రస్తుతం మింట్ కాంపౌండ్ లోని సంస్థ మెయిన్ ఆఫీస్ ను.. గ్రేటర్ పరిధిలోని వివిధ ప్రధాన సర్కిల్ ఆఫీసులను..కంట్రోల్ రూమ్‌లోని స్కాడా సిస్టమ్స్ కు లింక్చేశారు.
