- రక్త పరీక్షలు బంద్.. స్ట్రెచర్లపై టబ్బుల్లో నీటి మోత
- పేషెంట్లు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు
- కొండాపూర్ జిల్లా దవాఖానలో దుస్థితి
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాల్సిన కొండాపూర్ జిల్లా దవాఖానలో కనీస వసతులు కరువయ్యాయి. నాలుగు రోజులుగా హాస్పిటల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఉక్కపోతతో పేషెంట్లు, గర్భిణలు, శిశువులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న జనరేటర్ పనిచేయకపోవడం, సోలార్ విద్యుత్ ఒక్కరోజుకే పరిమితం కావడంతో దవాఖాన అంధకారంలో ఉంది.
ప్రస్తుతం 136 మంది ఇన్‌పేషెంట్లు ఉన్న ఈ హాస్పిటల్లో.. కరెంట్ లేక వైద్యులు సెల్‌ఫోన్లు, టార్చ్‌లైట్ల వెలుతురులోనే చిన్నచిన్న సర్జరీలు, గర్భిణులకు డెలివరీలు చేస్తున్నారని పేషెంట్ల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రక్త పరీక్షలు నిలిచిపోవడంతో పేషెంట్లు ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు మంచినీటి కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో సిబ్బంది స్ట్రెచర్‌లపై టబ్బుల్లో నీళ్లు మోయాల్సి వస్తోంది.
మందులు కూడా సరిగా అందుబాటులో లేకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నామని బాధితులు వాపోతున్నారు. రాజధాని ప్రాంతంలోని ప్రధాన జిల్లా దవాఖానలో ప్రాథమిక సదుపాయాలు కరువవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వైఫల్యాన్ని నిరసిస్తూ శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ నాయకులు హాస్పిటల్ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి, తాగునీరు, మందులు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
