- కృష్ణా ట్రిబ్యునల్లో ఏపీ వాదనలకు తెలంగాణ రిజాయిండర్ వాదనలు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ దురాశతో నీళ్లను తీసుకెళ్తున్నదని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. కృష్ణాలాంటి లోటు ఉండే బేసిన్లోనూ రెండు రాష్ట్రాల అవసరాలకు సరిపడా నీళ్లు వస్తాయని.. అయినా ఏపీ మాత్రం అడ్డగోలుగా వాడుకుంటున్నదని ఆక్షేపించింది. వరికి అవసరమయ్యే నీటికన్నా ఎక్కువగా వాడుకుంటూ మళ్లీ అదనంగా అడుగుతున్నదని ఆరోపించింది. శుక్రవారం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు తెలంగాణ వాదనలు వినిపించింది.
గురువారం ఏపీ వాదనలు ముగిసిపోగా.. ఏపీ వాదనలకు తెలంగాణ రిజాయిండర్లు (కౌంటర్/వివరణలు) ఇచ్చింది. అందులో భాగంగా శుక్రవారం ట్రిబ్యునల్ ముందు తెలంగాణ తరఫున అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నీటి కేటాయింపులను.. కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం ఉందని భావించే కేంద్రం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 3కి ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను జోడించిందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నీటి కేటాయింపులు తాత్కాలికమేనని, అది కేవలం అడ్మినిస్ట్రేటివ్ అరెంజ్మెంట్ మాత్రమేనని తేల్చి చెప్పారు. 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు పంచుకుంటున్న నీళ్ల వాటా శాశ్వతం కాదన్నారు.
వరికి 400 టీఎంసీలు చాలు..
ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ2 కేటాయింపులను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం లేదని ఏపీ వాదించడం తప్పు అని తెలంగాణ అడ్వకేట్ వాదించారు. ఇరు రాష్ట్రాలకు ఆవిరి నష్టాలు, తాగునీటి, పారిశ్రామిక అవసరాలు పోనూ సాగుకు 780 టీఎంసీలు ఉంటాయన్నారు. అందులో వరి పంటకు 400 టీఎంసీలు వాడుకోవచ్చన్నారు. 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడంతోపాటు 42 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లిచ్చే చాన్స్ ఉంటుందన్నారు. కృష్ణాలోని నీటిని తలసరి వినియోగం కింద లెక్కగట్టి చెప్తున్న ఏపీ.. కృష్ణాలో కలుస్తున్న గోదావరి నీళ్లు, పెన్నా నీళ్లను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. జల వివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ఎలాంటి జలవివాదాలు లేవని ఏపీ చెప్తున్నదని.. కానీ, అదే సెక్షన్ 3, సెక్షన్ 2 కిందే తొలిసారి వివాదాలు వచ్చాయని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు.
చట్టంలోని సెక్షన్లో వివాదాలున్నాయని గుర్తించే కేంద్రం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను తీసుకొచ్చిందన్నారు. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను మార్చాల్సిన అవసరం లేదని బ్రిజేశ్ ట్రిబ్యునల్ చెప్పిందంటూ ఏపీ వాదిస్తున్నా.. తర్వాత ఏపీ విభజన జరిగిందని అడ్వకేట్ చెప్పారు. కేటాయింపుల్లో రాష్ట్రాలకు వాటాలు తేల్చలేదంటూ ట్రిబ్యునల్ ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు వాటాలను తేల్చాల్సిన అవసరం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇప్పటికే చేసిన గంపగుత్త కేటాయింపులను ట్రిబ్యునల్ మార్చనప్పటికీ.. ఆ గంపగుత్త కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు వాటాలు ఇచ్చే అధికారం ఉంటుందన్నారు.
బోర్డులకు ఆ అధికారం లేదు..
విభజనచట్టంలోని 84, 85(8), 87 సెక్షన్ల ప్రకారం నీటి వాటాల పంపకాలపై బోర్డులకు అధికారం లేదని అడ్వకేట్ స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ ఇచ్చిన కేటాయింపులను అమలు చేయడం మాత్రమే బోర్డుల విధి అని చెప్పా రు. విభజనచట్టం, జల వివాదాల చట్టాన్ని ఏపీ తప్పుగా చెప్తున్నదని పేర్కొన్నారు. ఆర్టికల్ 262 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ నీటిని కేటాయించాలన్నారు.
జల కేటాయింపులను చేయడంలో పార్లమెంట్కుగానీ, కేంద్రానికిగానీ అధికారం లేదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే కేడబ్ల్యూడీటీ 2కి ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను కేంద్రం సిఫార్సు చేసిందన్నారు. విభజన చట్టంలోని 85(8) సెక్షన్ తాత్కాలికం కాదని, తదుపరి చేసే కేటాయింపులు సహా అన్ని కేటాయింపులనూ దాని ప్రకారమే చేయాల్సి ఉంటుందన్నారు. కాగా, తదుపరి వాదనలు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి.
