హైదరాబాద్, వెలుగు: యూపీఐ సేవలకు కొద్దిసేపు అంతరాయం కలగడంతో జనం ఉక్కిరి బిక్కిరి అయ్యారు. శుక్రవారం రాత్రి 7:30 తర్వాత టెక్నికల్ కారణాలతో ఫోన్‌పే, గూగుల్ పే సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
పలు మెట్రో స్టేషన్లలో టికెట్ కౌంటర్లు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల వద్ద ప్రయాణికులు బారులు తీరారు. ఒక్కసారిగా సర్వర్లు డౌన్ కావడంతో స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగిపోయింది. అమీర్‌పేట్, మియాపూర్, ఎల్బీనగర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్ వంటి మెట్రో స్టేషన్లలో భారీ క్యూలైన్లు దర్శనమిచ్చాయి. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడ్డారు. సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
