హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్-2026 స్పెషల్ డ్రైవ్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ విడతలో 14,975 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ వివరాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఎ. దేవసేన శుక్రవారం తెలిపారు. మొత్తం 16,312 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోగా.. తక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఇవ్వడంతో 1,337 మందికి సీట్లు రాలేదని అధికారులు తెలిపారు. ఫ్యాకల్టీల వారీగా చూస్తే కామర్స్‌లో 6,198 మందికి సీట్లు వచ్చాయి.
లైఫ్ సైన్సెస్‌లో 3,080, ఆర్ట్స్‌లో 2,878, ఫిజికల్ సైన్సెస్‌లో 2,798 మందికి సీట్లు కేటాయించారు. సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తమ లాగిన్ ఐడీ ద్వారా రూ.500 లేదా రూ.1,000 ఫీజు చెల్లించి సీటును రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీటు వచ్చిన విద్యార్థులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
