ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నరేండ్లకే కట్టాలి..ఐదేండ్ల ఫీజు వసూలు చేస్తే కాలేజీలపై కఠిన చర్యలు

ఎంబీబీఎస్ ఫీజు నాలుగున్నరేండ్లకే కట్టాలి..ఐదేండ్ల ఫీజు వసూలు చేస్తే కాలేజీలపై కఠిన చర్యలు
  • హాల్ టికెట్లు ఆపినా, బయోమెట్రిక్ అడ్డుకున్నా చర్యలు తప్పవు  
  •     స్టైపెండ్ వెనక్కి తీసుకునే కాలేజీలపై టీఏఎఫ్ఆర్సీ సీరియస్
  •     ఏయే కాలేజీలు ఎంత ఫీజు వసూలు చేయాలో లిస్టు విడుదల 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ కోర్సు ఫీజును కేవలం నాలుగున్నరేండ్ల కాలానికి మాత్రమే వసూలు చేయాలని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) ఆదేశించింది. 2021–-2023, 2023–-2026 బ్లాక్ పీరియడ్లకు సంబంధించి ఫీజు నిర్మాణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తూ టీఏఎఫ్ఆర్సీ శుక్రవారం ఏయే కాలేజీలలో ఎంత ఫీజు వసూలు చేయాలో తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి 9 సెమిస్టర్లు మాత్రమేనని, ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్ కాలంలో ఎలాంటి బోధన ఉండదు కాబట్టి.. ఆ కాలానికి ఫీజు వసూలు చేయకూడదని నేషనల్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్ఎంసీ) రూల్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తుచేసింది. ఒకవేళ ఇప్పటికే ఐదేండ్ల ఫీజు వసూలు చేసి ఉంటే, ఆ అదనపు మొత్తాన్ని వెంటనే విద్యార్థులకు రీఫండ్ చేయాలని ఆదేశించింది. 

ఆ కాలేజీలపై కఠన చర్యలు... 

కొన్ని మెడికల్ కాలేజీలు ఐదేండ్ల ఫీజు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, ఫీజు చెల్లించని విద్యార్థులను క్లాసులకు రానివ్వకపోవడం, హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, అటెండెన్స్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకోవడం వంటివి చేస్తున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. స్టూడెంట్లను, పేరెంట్స్‌‌‌‌‌‌‌‌ను భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి పద్ధతులను తీవ్రంగా పరిగణిస్తామని కమిటీ హెచ్చరించింది. వీటితో పాటు కొన్ని కాలేజీలు స్టైపెండ్ కోసం విద్యార్థుల నుంచే డబ్బులు వసూలు చేస్తున్నాయని, వారి ఖాతాల్లో వేసిన నగదును తిరిగి వెనక్కి తీసుకుంటున్నాయని ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది.

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు... 

మొత్తం కోర్సు ఫీజును ఐదు వాయిదాల్లో వసూలు చేయాలని టీఏఎఫ్ఆర్సీ సూచించింది. మొదటి నాలుగేండ్లు పూర్తి వార్షిక ఫీజును, చివరి ఏడాదిలో కేవలం ఆరు నెలల ఫీజును మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు ఒక కాలేజీకి ఏడాదికి రూ.14.50 లక్షల ఫీజు ఉంటే, మొదటి నాలుగేండ్లు అదే మొత్తాన్ని వసూలు చేసి, చివరి సెమిస్టర్ కోసం రూ.7.25 లక్షలు మాత్రమే తీసుకోవాలని వివరించింది. కేటగిరీ --బి, కేటగిరీ- సి విద్యార్థులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని, కమిటీ నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.