- గత 12 ఏళ్లలో 11 రెట్ల పెరుగుదల
- 25 లక్షల ఉద్యోగాల సృష్టి
- మొబైల్స్ తయారీలో గ్లోబల్‌గా రెండో స్థానం..
న్యూఢిల్లీ: భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగం దూసుకుపోతోంది. తయారీ, ఎగుమతుల్లో రికార్డులు సృష్టిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎల్‌ఐ వంటి స్కీమ్‌లు పెట్టుబడులను భారీగా ఆకర్షించడంతో లోకల్‌గా తయారీ ఊపందుకుంంది. దీనికి తోడు దేశీయంగా సప్లయ్ చెయిన్ బలపడడంతో ఎగుమతులు పెరుగుతున్నాయి. దేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు గత 12 ఏళ్లలో ఏకంగా 11 రెట్లు పెరిగి, 2025–-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.60 లక్షల కోట్లకు (47.96 బిలియన్ డాలర్లకు) చేరుకున్నాయి. 2014–15లో కేవలం రూ. 38 వేల కోట్లుగా ఉన్న ఎగుమతులు ఈ స్థాయికి చేరగా, ప్రస్తుతం దేశంలోనే మూడో అతిపెద్ద ఎగుమతి రంగంగా ఎలక్ట్రానిక్స్ అవతరించింది. ఆటోమొబైల్స్, స్టీల్ వంటి ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్లు, యాక్ససరీలు, కంప్యూటర్ పరికరాలు, సర్క్యూట్ బోర్డులు, కెపాసిటర్లు, ట్రాన్సిస్టర్ల వాటా ఎక్కువగా ఉంది.
*ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు పెరగడంలో మొబైల్ ఫోన్ల వాటా కీలకంగా ఉంది. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా ఎదిగింది. 2014–-15లో మన ఎగుమతుల్లో 153వ స్థానంలో ఉన్న మొబైల్ ఫోన్లు, 2025-–26 నాటికి దేశంలోనే నంబర్ వన్ ఎగుమతి ఉత్పత్తిగా రికార్డు సృష్టించాయి. మొబైల్ ఎగుమతులు రూ. 1,500 కోట్ల నుంచి ఏకంగా 165 రెట్లు పెరిగి రూ. 2.59 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి గత 12 ఏళ్లలో రూ. 18 వేల కోట్ల నుంచి రూ. 6.27 లక్షల కోట్లకు ఎగబాకింది.
*మొత్తం ఎలక్ట్రానిక్స్ రంగంలో మహిళా ఉద్యోగుల వాటా 30 శాతానికి చేరగా, ఒక్క మొబైల్ తయారీ పరిశ్రమలో ఏకంగా 70 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ రంగం గత పదేళ్లలో దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించగా, మొబైల్ తయారీ రంగం ద్వారానే సుమారు 12 లక్షల మందికి ఉపాధి లభించింది.
*ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) స్కీమ్, ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం), ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ వంటి ప్రభుత్వ విధానాలతో గ్లోబల్ టెక్ కంపెనీలు ఇండియాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ప్రస్తుతం సెమీకండక్టర్లు, డిజైనింగ్, టెస్టింగ్ వంటి రంగాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
*ఎలక్ట్రానిక్స్ విప్లవంతో పాటు డిజిటల్ ఎకానమీ జీడీపీలో 14 శాతానికి విస్తరించింది. 2014లో 25.15 కోట్లు ఉన్న యూజర్లు, మార్చి 2026 నాటికి 109.2 కోట్లకు పెరిగారు. 2014లో జీబీ డేటా ధర రూ. 308 ఉండగా, 2026 నాటికి అది రూ. 7.51కి పడిపోయింది. దేశంలోని 99.9శాతం జిల్లాలకు 5.63 లక్షల 5జీ బేస్ స్టేషన్ల ద్వారా హైస్పీడ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. డౌన్‌లోడ్ వేగం 13.67 ఎంబీపీఎస్ నుంచి 132 ఎంబీపీఎస్‌కి పెరిగింది.
