సంస్కరణలు ఆర్భాటం కాదు.. మా ప్రభుత్వ దృఢ విశ్వాసం: ప్రధాని మోడీ

సంస్కరణలు ఆర్భాటం కాదు.. మా ప్రభుత్వ దృఢ విశ్వాసం: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: సంస్కరణలు తమ ప్రభుత్వానికి ఒక దృఢ నిశ్చయమని.. కేవలం ఆర్భాటపు మాటలు కాదని ప్రధాని అన్నారు. శనివారం (ఆగస్ట్ 15) 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎర్రకోటపై ప్రధాని మోడీ వరుసగా 13వ సారి మువ్వెన్నల జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతీనుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవం వేళ  ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతి హృదయం వందేమాతరం నినాదంతో మార్మోగుతోందన్నారు. 80 ఏళ్ల స్వతంత్ర భారత దేశ చరిత్రలో తొలిసారి ఎర్రకోటపై వందేమాతరం ఆలపించామని పేర్కొన్నారు. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్య్రం అమరవీరులను గుర్తు చేసుకున్నారు.

దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తుందని.. మన సంకల్పం, కలలు సాకారమవుతున్నాయని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్నామని పేర్కొన్నారు. భారత్ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ దిశగా ఎదుగుతోందన్నారు. సంకల్పం దృఢంగా ఉంటే కఠిన సవాళ్లను సునాయసంగా ఎదర్కొవచ్చన్నారు. ఇవాళ ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని అన్నారు. దేశంలో మురుగు దొడ్లు శౌచాలయాలు 4 రెట్ల వేగంతో నిర్మించామని చెప్పారు.

 అలాగే, పేదలలకు 3 రెట్ల వేగంతో ఇళ్లు నిర్మించామన్నారు. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్ల సదుపాయం పెంచామని చెప్పారు. ఆత్మనిర్భర్ సాధనే మన లక్ష్యమని తెలిపారు. భారత్ లో సెమీ కండక్టర్లు తయారీ కూడా సాకారమవుతోందన్నారు. దేశంలో ఇటీవలే హైడ్రోజన్ రైలును విజయవంతంగా నడింపించామని గుర్తు చేశారు. 90 ఏళ్లలో 30 శాతం మాత్రమే రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని.. కానీ గత పదేళ్లలోనే 70 శాతం రైళ్ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశామన్నారు. 

50 లక్షల ఇళ్లకు సౌరశక్తితో విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఐదు న్యూక్లియర్ రియాక్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల్లో చిప్ ల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. సెమీకండక్టర్ల రంగంలో స్వావలంభన దిశగా కీలకమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందని.. ఏడెనిమిదేళ్లలో 8 సెమీ కండక్టర్ ప్లాంట్లు మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

వోకల్ ఫర్ లోకల్‎ నినాదంతో ముందుకు వెళ్తుమన్నాన్నారు. భారతదేశ ఆకాంక్షలు ఉన్నతంగా ఉండాలని, ఆ కలలను సాకారం చేసుకోవాలంటే సంకల్పం దృఢంగా ఉండాలని అన్నారు. సవాళ్లు, సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు దృఢ సంకల్పం దేశానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు.దేశ నిర్మాణంలో దృఢ సంకల్పం కీలక పాత్ర పోషిస్తుందని, అత్యంత క్లిష్ట పరిస్థితులలో కూడా ప్రజలు పరిష్కారాలను కనుగొనేలా ఇది వీలు కల్పిస్తుందన్నారు.