- పరీక్షా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు
- గ్లోబల్ సంస్థల్లో దేశ యువత సత్తా
- జాబ్ కోసం చూడకుండా
- ఉద్యోగ సృష్టికర్తలుగా మారారని కితాబు
- సింధూ జలాల ఒప్పందం నిలిపివేత
- సాహసోపేతమైన నిర్ణయం
- భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది..
- 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు
న్యూఢిల్లీ: భారతదేశ భవిష్యత్ ను తీర్చిదిద్దే శిల్పులు విద్యార్థులేనని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అనేవి విద్యార్థుల అవకాశాలకు వారధిలాంటివని, అలాంటి వ్యవస్థను అక్రమాలకు చోటివ్వని రీతిలో, పూర్తి పారదర్శకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జాతీయ భద్రతను కాపాడటానికి ప్రభుత్వం, సమాజం ఎలా ఐక్యంగా ఉంటాయో.. అలాగే విద్యార్థుల వర్తమానాన్ని, భవిష్యత్తును రక్షించడానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
దేశ యువత ఉద్యోగాల కోసం వెతుక్కోవడం కంటే ఉద్యోగాలను సృష్టించే సంస్కృతిని ఎక్కువగా అవలంబిస్తున్నారని ప్రశంసించారు. ప్రముఖ గ్లోబల్ సంస్థలే భారతీయ యువత ప్రతిభ, అంకితభావానికి ముగ్ధులైన వారికి కీలకమైన నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నాయని గుర్తుచేశారు. దేశ ఉజ్వల భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని యువశక్తి మరింత బలపరుస్తోందని వెల్లడించారు. దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
దేశ నిర్మాణానికి క్రీడలే ముఖ్య సాధనం
సమగ్ర అభివృద్ధి గురించి రాష్ట్రపతి ప్రస్తావించారు. ‘యువత శారీరక, మానసిక ఆరోగ్యం దేశ భవిష్యత్తుకు పునాది. వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత కుటుంబాలపై, సమాజంపై ఉంది. యువత అభివృద్ధికి, దేశ నిర్మాణానికి క్రీడలు ఒక ముఖ్యమైన సాధనంగా నిలుస్తున్నాయి. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మంచి క్రీడా వాతావరణం రూపుదిద్దుకుంటోంది. క్రీడలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోంది. అందుకే అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మన క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని వివరించారు.
ఆపరేషన్ సిందూర్ దేశ సామర్థ్యాన్ని చాటిచెప్పింది
భారత సాయుధ దళాల పరాక్రమాన్ని కొనియాడిన రాష్ట్రపతి ముర్ము.. ఆపరేషన్ సిందూర్ దేశ సామర్థ్యాన్ని చాటిచెప్పిందని గుర్తుచేశారు. టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే బలమైన హెచ్చరికను పంపిందన్నారు. ‘జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్‌ను జరుపుకున్నాం. అంతకుముందు మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా దాన్ని స్మరించుకున్నాం.
మన సాయుధ దళాల సాటిలేని పరాక్రమాన్ని గుర్తుచేసుకున్నాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగిన ఆపరేషన్ సిందూర్.. భారత సాయుధ దళాలు ఎంతటి కచ్చితత్వంతో వ్యవహరించగలవో నిరూపించింది’ అని పేర్కొన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు ఆశ్రయం కల్పిస్తున్న దేశంతో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రపతి సమర్థించారు. ఇది దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న ధైర్యమైన, స్పష్టమైన నిర్ణయమని అభివర్ణించారు.
నక్సలిజం నిర్మూలన గొప్ప విజయం
దశాబ్దాల పోరాటం తర్వాత నక్సలిజాన్ని నిర్మూలించడం దేశానికి ఒక చారిత్రాత్మక విజయమని రాష్ట్రపతి అన్నారు. ‘దశాబ్దాలుగా నక్సలిజం దేశానికి పెద్ద సవాలుగా మారింది. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడం ఒక గొప్ప విజయం. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ఉత్సాహం వెల్లివిరుస్తోంది. బస్తర్ ఒలింపిక్స్, బస్తర్ పండుమ్ ఉత్సవాల వంటి కార్యక్రమాల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యం, సర్వత్రా అభివృద్ధి ప్రయత్నాలు ప్రశంసనీయం’ అని తెలిపారు.
వారసత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు
ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వాన్ని కాపాడుకుంటూనే మన దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతోందని రాష్ట్రపతి తెలిపారు. బుద్ధుడు మొదటి ప్రసంగం చేసిన సార్నాథ్ ప్రాంతం ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. శాంతి, సహకారం, వసుధైవ కుటుంబ భావనే మన విదేశాంగ విధానానికి మూలస్తంభాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై ప్రపంచ దేశాలకు తగిన ప్రాతినిధ్యం లభించేలా భారత్ నిరంతరం కృషి చేస్తోందన్నా.
దేశ జనాభాలో 65 శాతం మంది యువతే ఉన్నారని, వారే దేశానికి అత్యంత విలువైన ఆస్తి అని వివరించారు. స్టార్టప్‌లు, అంతరిక్ష పరిశోధనలు, వ్యవసాయం వంటి రంగాలలో యువత అద్భుతాలు సృష్టిస్తోందని రాష్ట్రపతి ప్రశంసించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్రపతి ముర్ము వెల్లడించారు. ఇప్పటికే 3 కోట్ల మంది ‘లఖ్‌పతి దీదీ’ల లక్ష్యాన్ని సాధించామని, త్వరలో మరో మూడు కోట్ల మందికి ఆ అవకాశం కల్పిస్తామని చెప్పారు.
కామన్వెల్త్లో మన మహిళా ప్లేయర్లు రికార్డు స్థాయిలో స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటారని అభినందించారు. అలాగే ‘నారీ శక్తి వందన్ అధినియం’ చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం 70 ఏళ్లు దాటిన దాదాపు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఏటా 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, వారి గౌరవాన్ని సమాజం కాపాడాలని పిలుపునిచ్చారు.
వేగంగా భారత్ అభివృద్ధి
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత ఉన్నప్పటికీ, భారత్ మాత్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్రపతి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ మన ఆర్థిక పురోగతికి గట్టి పునాది వేసిందని చెప్పారు. గత దశాబ్దంలో సంక్షేమ పథకాల ద్వారా 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, 80 కోట్ల మందికి పైగా ఉచితంగా ఆహార భద్రతను అందిస్తున్నామని వివరించారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో గడువు కంటే ముందే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధిస్తున్నామని చెప్పారు. తెలుగు కవి గురజాడ అప్పారావు ‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ వ్యాఖ్యలను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2047 నాటికి భారత్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రతి పౌరుడూ శ్రమించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా.. రాష్ట్రపతి తన ప్రసంగానికి ముందు, తర్వాత వందేమాతరం గేయం పూర్తిగా ఆలపించారు.
