రాహుల్ ,ప్రియాంక అరెస్ట్.. ఢిల్లీ ఆకాశవాణి భవన్ దగ్గర ఉద్రిక్తత

రాహుల్ ,ప్రియాంక  అరెస్ట్.. ఢిల్లీ ఆకాశవాణి భవన్ దగ్గర ఉద్రిక్తత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ వద్ద  హైడ్రామా చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పలువురు INDIA కూటమి నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

పోలీసులతో నేతల వాగ్వాదం

ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్‌గా బయలుదేరిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నేతలు ఆకాశవాణి భవన్ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు కొందరు నేతలు ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాహుల్ గాంధీ బారికేడ్‌పైకి ఎక్కి జాతీయ జెండాను ప్రదర్శించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర నేతలు ఆకాశవాణి భవన్ ప్రాంగణంలోకి వెళ్లి అక్కడే బైఠాయించారు. ఎన్నికల సంఘం కార్యాలయం ఆకాశవాణి భవన్‌కు సుమారు 100 మీటర్ల దూరంలోనే ఉండటంతో పోలీసులు భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 

రాహుల్‌ను ఎత్తుకుని వాహనంలోకి..

నిరసన కొనసాగుతుండగా పోలీసులు రాహుల్ గాంధీని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. నిరసనకు రాహుల్ సహకరించకపోవడంతో పోలీసులు ఆయనను ఎత్తుకుని వాహనంలోకి తరలించారు.  ప్రియాంక గాంధీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని బస్సులోకి ఎక్కించారు. 

రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఓ'బ్రెయిన్ తదితర విపక్ష నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేతలు కే.సీ. వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హూడా కూడా నిరసనలో పాల్గొన్నారు. 

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని INDIA కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించేందుకు విపక్ష ఎంపీలు మార్చ్ చేపట్టారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ విపక్ష ఎంపీలు ఎన్నికల సంఘం అధికారులను కలిసేందుకు మాత్రమే వెళ్లారని, తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.