US Citizenship: గతంలో ఎన్నడూ లేనివిధంగా అతి పెద్ద డెనేచురలైజేషన్ (పౌరసత్వ రద్దు) ప్రక్రియకు అమెరికా న్యాయ శాఖ (DOJ) శ్రీకారం చుట్టింది. విదేశీ ప్రభుత్వానికి ఏజెంట్లుగా వ్యవహరించడం, నకిలీ పత్రాలతో పౌరసత్వం పొందడం లాంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 40 మంది వ్యక్తుల యూఎస్ సిటిజన్‌షిప్ ని రద్దు చేసేందుకు వివిధ అమెరికన్ కోర్టులలో న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు న్యాయ శాఖ సోమవారం వెల్లడించింది. ఈ జాబితాలో ఒక భారతీయ సంతతి వ్యక్తితో పాటు పాకిస్థాన్, చైనా, మెక్సికో, కంబోడియా, నేపాల్, ఆఫ్ఘనిస్థాన్‌లకు చెందినవారు ఉన్నారు.
భారతీయ సంతతికి చెందిన బల్విందర్ సింగ్‌పై చర్యలు:
ఈ జాబితాలో కాలిఫోర్నియాకు చెందిన బల్విందర్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నకిలీ గుర్తింపును ఉపయోగించి అమెరికా పౌరసత్వాన్ని పొందాడనే ఆరోపణలతో ఆయనపై స్టేట్ ఈస్ట్ జిల్లా కోర్టులో డెనేచురలైజేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 1992లో బల్విందర్ సింగ్ తన అసలు పేరుతో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తు సమర్పించగా, ఆ తర్వాత 2003లో రెండో గుర్తింపుతో శాశ్వత నివాస హోదా (పర్మనెంట్ రెసిడెన్సీ) పొందాడు. అతని వేలిముద్రల ఆధారంగా ఈ రెండు దరఖాస్తులు ఒకే వ్యక్తివని తేలింది. చివరకు 2009లో ఆ రెండో గుర్తింపుతోనే ఆయన అమెరికా పౌరసత్వాన్ని (Naturalisation) పొందినట్లు న్యాయ శాఖ నిర్ధారించింది. ఆయన చేసిన అనేక తప్పులు, మోసపూరిత చర్యల కారణంగా అతడి సిటిజన్‌షిప్ ని రద్దు చేయాలని కోరుతూ న్యాయ శాఖ కంప్లైంట్ దాఖలు చేసింది.
చైనా మాజీ నావికుడిపై గూఢచర్యం ఆరోపణలు:
ఇక చైనాలో జన్మించి అమెరికా నేవీలో పని చేసిన జిన్చావో వీ (Jinchao Wei) అనే మాజీ నావికుడు సైతం ఈ జాబితాలో ఉన్నారు. అమెరికా సైనిక రహస్యాలను చైనాకు విక్రయించే కుట్రలో భాగంగా ఆయన 2021లో నేవీలో చేరి, 2022 మే నెలలో అమెరికా పౌరసత్వం పొందాడు. గూఢచర్యానికి సంబంధించిన నేరాలకు పాల్పడినట్లు తేలడంతో గతేడాది ఆగస్టులో ఆయనకు కోర్టు 200 నెలల జైలు శిక్ష విధించడంతో పాటు నేవీ నుంచి డిశ్చార్జ్ చేసింది. ఇప్పుడు ఆయన పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అమెరికా న్యాయ శాఖ కఠిన హెచ్చరికలు:
ఈ కఠిన చర్యలపై అటార్నీ జనరల్ టోడ్ బ్లాంచె మాట్లాడుతూ.. అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద డెనేచురలైజేషన్ ప్రక్రియ అని తేల్చి చెప్పారు. సివిల్ డివిజన్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రెట్ ఎ. షూమేట్ మాట్లాడుతూ.. ఈ వ్యక్తులందరూ ఏదో ఒక మోసపూరిత మార్గంలో అబద్ధాలు చెప్పి యూఎస్ పౌరసత్వాన్ని సంపాదించారు. పౌరసత్వ వ్యవస్థపై నమ్మకాన్ని, పవిత్రతను పునరుద్ధరించడానికే ఈ భారీ చర్యలు చేపడుతున్నాం.. పౌరసత్వ ప్రక్రియలో ఎలాంటి మోసపూరిత విధానాలను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని వెల్లడించాడు. ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం.. తప్పుడు సమాచారంతో పొందిన పౌరసత్వాలను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
