సౌదీ కోర్టు ఖర్చులకు రూ.40 వేలు..సీఎం ప్రవాసీ ప్రజావాణిలో చెక్కు అందజేత

సౌదీ కోర్టు ఖర్చులకు రూ.40 వేలు..సీఎం ప్రవాసీ ప్రజావాణిలో చెక్కు అందజేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి పరిహారం అందేలా కోర్టులో కేసు దాఖలు చేసేందుకు అవసరమైన సర్టిఫికెట్ల అటెస్టేషన్, కోర్టు ఖర్చుల కోసం ఎన్ఆర్ఐ ఆకునూరి శంకర్ రూ.40 వేల ఆర్థిక సాయం అందజేశారు. 

జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రం మహేశ్​మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. 45 రోజులకే సైకిల్‌‌‌‌‌‌‌‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో చనిపోయాడు. దీంతో పరిహారం కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సాయం కోరుతూ ఆయన భార్య పూజారాణి తన ఇద్దరు బిడ్డలతో సీఎం ప్రవాసీ ప్రజావాణికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆకునూరి శంకర్ స్పందించి రూ.40 వేల చెక్కును పూజారాణికి అందజేశారు. సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్​కె.విద్యాసాగర్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్ పాల్గొన్నారు.

ప్రజావాణికి135 దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన 247వ సీఎం ప్రజావాణికి 135 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 30, బీసీ సంక్షేమ శాఖకు 22, సాధారణ పరిపాలన శాఖకు 15, ప్రవాసీ ప్రజావాణికి 3, ఇతర శాఖలకు 65 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కె విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.