- ప్రాక్టీస్ లైసెన్స్ రూల్స్‌లో కీలక మార్పులు చేస్తూ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం
- ఐదేండ్లకోసారి అప్‌డేట్ చేసుకోకపోతే ఇన్- యాక్టివ్‌గా గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: దేశంలోని ప్రతి డాక్టరుకు ఆధార్ తరహాలో ఒకే గుర్తింపు సంఖ్యను కేటాయించేలా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) యూనిక్ ఐడెంటిఫికేషన్ (యూఐడీ) విధానాన్ని తెరపైకి తెచ్చింది. నేషనల్ మెడికల్ రిజిస్టర్ (ఎన్ఎంఆర్) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లందరినీ ఒకే వేదికపైకి తెస్తూ, వారి అర్హతలు, నైపుణ్యాలను డిజిటల్ పద్ధతిలో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 'రిజిస్ట్రేషన్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ మెడిసిన్ (సవరణ) నిబంధనలు-2026' పేరుతో ఎన్ఎంసీ కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి డాక్టరుకు కేంద్రం యూఐడీ నంబర్‌ను కేటాయిస్తుంది. ఒక్కసారి ఈ రిజిస్టర్‌లో పేరు నమోదై యూనిక్ ఐడీ వస్తే, సదరు డాక్టర్ దేశంలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ఐదేండ్లకోసారి రెన్యువల్ మస్ట్..
ఇదే సమయంలో డాక్టర్ల ప్రాక్టీస్ లైసెన్స్ కాలపరిమితిపై కూడా కమిషన్ కీలక మార్పులు ప్రతిపాదించింది. ఇకపై డాక్టర్లకు ఇచ్చే లైసెన్స్ కేవలం ఐదేండ్ల కాలానికే పరిమితం కానుంది. గడువు ముగియడానికి మూడు నెలల ముందే రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ నిర్లక్ష్యం వహిస్తే వారి పేరు రిజిస్టర్‌లో ఇన్- యాక్టివ్‌గా మారుతుందని తేల్చిచెప్పింది. విదేశాల్లో చదివిన వైద్య విద్యార్థులు ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే నేషనల్ ఎఫ్‌ఎంజీఈ పాస్ కావాలని, తప్పనిసరిగా యూనిక్ ఐడీ పొందాలని సూచించింది. ఈ మార్పులపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోపు తెలపాలని సూచించింది.
