- హరీశ్ రావు, పాయల్ శంకర్ పిటిషన్లు డిస్మిస్
హైదరాబాద్, వెలుగు: బహిరంగ వేదికలపై రాజకీయ పార్టీలు, నేతలు ఇచ్చే విధానపరమైన హామీలను, పథకాలను అమలు చేయాలని కోర్టులు ప్రభుత్వాన్ని ఆదేశించలేవని హైకోర్టు స్పష్టం చేసింది. విధాన రూపకల్పన, పథకాల అమలు, ఆర్థిక కేటాయింపులు, బడ్జెట్ ప్రాధాన్యతలు పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశాలని తేల్చిచెప్పింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, రాజకీయ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని సుప్రీంకోర్టు చేసిన హెచ్చరికలను డివిజన్ బెంచ్ గుర్తుచేసింది. రైతులకు పంట రుణమాఫీ మొత్తాన్ని విడుదల చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, తుపాను పంట నష్టానికి ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల కాలేదంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దాఖలు చేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం కొట్టివేసింది.
రాజకీయ విమర్శలతోనే హరీశ్ రావు పిటిషన్
హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పేర్కొన్నప్పటికీ, అందులోని అంశాలు ఆయన రాజకీయ పాత్ర, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు, సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినవే ఉన్నాయని బెంచ్ పేర్కొంది. రూ.31 వేల కోట్లు కేటాయించాలా లేదా రూ.20 వేల కోట్లు విడుదల చేయాలా అనేది కార్యనిర్వాహక వ్యవస్థ ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. అధికారులకు నిర్ణయం తీసుకునేందుకు కోర్టు నిర్దేశించిన 8 వారాల గడువు ముగియకముందే హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారని, ఆయన వినతిపత్రం ఇంకా పరిశీలనలోనే ఉందని తెలిపింది. రుణమాఫీ నిధులు విడుదల కాకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
పాయల్ శంకర్ పిటిషన్‌లోనూ కొరవడిన వివరాలు
ఇక తుపాను పంట నష్టపరిహారం చెల్లించలేదంటూ పాయల్ శంకర్ దాఖలు చేసిన పిటిషన్‌లో పూర్తి వివరాలు లేవని హైకోర్టు తెలిపింది. సుమారు 15 లక్షల రైతు కుటుంబాలకు రూ.23,161 కోట్లు చెల్లించాలని కోరినప్పటికీ, పరిహారం అందని రైతులు ఎవరు, జరిగిన నష్టం ఎంత అనే స్పష్టమైన వివరాలు, లబ్ధిదారుల జాబితాను సమర్పించలేదని పేర్కొంది. ప్రభుత్వం ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ నిధులు మంజూరు చేసిందని, ఆ నిధులను పంపిణీ చేయడం కార్యనిర్వాహక విభాగానికి సంబంధించిన అంశమని స్పష్టం చేసింది. చెల్లింపుల్లో జాప్యం జరిగినంత మాత్రాన జీవనోపాధి హక్కు హరించబడినట్లు భావించలేమని తేల్చిచెప్పింది. రాజ్యాంగపరమైన బాధ్యతల ఉల్లంఘన జరిగినట్లు నిరూపించకుండా, కేవలం జాప్యంపై అసంతృప్తితో కోర్టు జోక్యం చేసుకోలేదని స్పష్టం చేస్తూ రిజిస్ట్రీ అభ్యంతరాన్ని సమర్థించింది.
