సిద్దిపేట రూరల్, వెలుగు : 'బెట్టింగ్, ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి నష్టపోయా, నా కోసం ఎవరూ వెతకొద్దు' అని లెటర్ రాసి ఓ బీటెక్ స్టూడెంట్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. వన్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన గుండ్ల క్రాంతి కుమార్ స్థానిక ఇందూరి ఇంజినీరింగ్ కాలేజీ లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ లో డబ్బులు పెట్టి భారీ మొత్తంలో పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన క్రాంతి కుమార్ శుక్రవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అంతకుముందు తన ఫ్రెండ్ ఈశ్వర్ కు మెసేజ్ చేయడంతో అతడు క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
వారు ఇంట్లో వెతకగా క్రాంతి కుమార్ రాసిన లెటర్ కనిపించింది. తాను ఎక్కడో ఒక చోట బతికే ఉంటానని, తన గురించి వెతకొద్దని క్రాంతి కుమార్ రాసినట్లుగా సీఐ తెలిపారు. స్టూడెంట్ తల్లి శైలజ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
