ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్‌లో మెటా సంస్థ కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి వాట్సాప్‌లో ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న కస్టమర్ సర్వీస్ మెసేజింగ్ సేవలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. లాంచ్ అయినప్పటి నుంచి ఫ్రీగా ఉన్న ఈ కమ్యూనికేషన్ కేటగిరీపై ఇక నుంచి ప్రతి మెసేజ్‌కు ఛార్జీలు వర్తించనున్నాయి. ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ నిర్వహిస్తున్న పెద్ద కంపెనీలకు ఈ నిర్ణయం భారీ ఆర్థిక భారమే.
కొత్త ఛార్జీలు ఏమిటి?
ఇప్పటివరకు కస్టమర్ మెసేజ్ చేసిన తర్వాత ప్రారంభమయ్యే 24 గంటల 'సర్వీస్ విండో' సమయంలో వ్యాపార సంస్థలు ఉచితంగా రిప్లై ఇస్తూ వచ్చాయి. కానీ అక్టోబర్ 1 నుంచి ఈ సర్వీస్ మెసేజ్‌లు భారతదేశంలో ఒక్కో మెసేజ్‌కు సుమారు 11.5 పైసలు చొప్పున ఛార్జ్ చేయబడతాయి. అలాగే గతంలో ఉచితంగా ఉన్న యూటిలిటీ టెంప్లేట్ మెసేజ్‌లపై కూడా ఇకపై బిల్లింగ్ ఉంటుందని మెటా వెల్లడించింది. 24 గంటల విండో లోపల పంపినప్పటికీ వాటికి ఛార్జీలు చెల్లించాల్సిందేనని మెటా స్పష్టం చేసింది.
నెలవారీ ఉచిత కోటా..
వ్యాపార సంస్థలపై ఒక్కసారిగా భారం పడకుండా ప్రతీ బిజినెస్ ఫోన్ నంబర్‌కు క్యాలెండర్ నెలకు 1,000 ఉచిత సర్వీస్ మెసేజ్‌లను మెటా కేటాయించింది. ఈ కోటా ప్రతి నెలా రీసెట్ అవుతుంది. అయితే తర్వాతి నెలకు ఫార్వార్డ్ కాదు. ఈ 1,000 ఉచిత మెసేజ్‌ల పరిమితి దాటిన తర్వాత ప్రతీ మెసేజ్‌కు విడివిడిగా బిల్లింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఒకే కస్టమర్ సపోర్ట్ చాట్‌లో బదులిచ్చే అనేక మెసేజ్ బబుల్స్‌కు విడివిడిగా ఛార్జీలు పడతాయి.
ఎవరిపై ఈ ప్రభావం పడుతుంది?
ఈ కొత్త రూల్స్ కేవలం పెయిడ్ వాట్సాప్ బిజినెస్ API వాడుతున్న పెద్ద సంస్థలు, హై-వాల్యూమ్ ఆటోమేటెడ్ సపోర్ట్ రన్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. వ్యక్తిగత వాట్సాప్ వినియోగదారులకు, చిన్న వ్యాపారాలు వాడే ఫ్రీ వాట్సాప్ బిజినెస్ యాప్‌కు దీనితో ఎలాంటి సంబంధం లేదు. AI ఆధారిత ఏజెంట్లను వాడే సంస్థల నిర్వహణ ఖర్చులు మెటా నిర్ణయంతో భారీగానే పెరిగే అవకాశం ఉంది.
మెటా నిర్ణయం వెనుక అసలు ఉద్దేశం
వాట్సాప్‌లో భారీ ఎత్తున జరిగే ఆటోమేటెడ్ స్పామ్ మెసేజింగ్‌ను అరికట్టడానికి, ఇతర కస్టమర్ సర్వీస్ ఛానెళ్ల మాదిరిగానే దీని ఆర్థిక విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మెటా చెబుతోంది. ఈ కొత్త రూల్స్ వల్ల వ్యాపార సంస్థలు తమ కస్టమర్ కమ్యూనికేషన్ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
