ట్రావెల్స్ బస్సు పల్టీ 20 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం....మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ దగ్గర ఘటన

ట్రావెల్స్ బస్సు పల్టీ 20 మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం....మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ దగ్గర ఘటన

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ వద్ద 44వ నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అరుణాచలం బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున భూత్పూర్ సమీపంలోకి చేరుకోగానే బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని, బోల్తా పడింది. 

ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్పీ జానకీ ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.