- కాస్ట్లీ బట్టలు, యాక్సెసరీస్‌తో మాయ
- గోల్డ్‌చైన్లు, బంగారు ఉంగరాలతో ‘గోల్డ్‌మ్యాన్’ లుక్
- అమ్మాయిల వద్ద డబ్బు, బంగారం తీసుకొని పరార్
కుత్బుల్లాపూర్, వెలుగు: సంగారెడ్డికి చెందిన సాగర్చౌదరి అలియాస్ సాయిసునీల్(25) అనే యువకుడు రిచ్కిడ్లా నటించి సోషల్ మీడియా ద్వారా 20 మందికి పైగా యువతులను మోసం చేసిన ఘటనలో పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా తిరుగుతున్న నిందితుడు జల్సాల కోసం అడ్డదారి తొక్కి, స్నాప్‌చాట్ ద్వారా యువతులను టార్గెట్ చేసేవాడు. రోజులో 14 గంటలకు పైగా సోషల్ మీడియాలోనే గడుపుతూ.. తనకున్న అందం, ఎత్తును అడ్వాంటేజ్‌గా మార్చుకుని అమ్మాయిలను వలలో వేసుకునేవాడు. నిందితుడి వివరాలను శుక్రవారం మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, సీఐ విజయవర్ధన్, క్రైమ్ ఇన్స్పెక్టర్అజయ్ వెల్లడించారు.
సినిమా స్టార్లా బిల్డప్..
సాయిసునీల్ కాస్ట్లీ బట్టలు ధరించి, రెంట్‌కు తీసుకున్న లగ్జరీ కార్లలో షికార్లు చేస్తూ సినిమా స్టార్లను తలపించేలా తిరిగేవాడు. మెడలో ధగధగ మెరిసే బంగారు చైన్లు, చేతులకు ఉంగరాలతో తాను కోటీశ్వరుడినని, ఉన్నత కుటుంబానికి చెందిన వాడినని నమ్మించేవాడు. అమ్మాయిలతో ప్రేమగా మాట్లాడుతూ రెస్టారెంట్లకు బ్రంచ్, లంచ్, డిన్నర్‌కు తీసుకువెళ్లేవాడు. దీంతో అతడి మాయలో పడిపోయిన యువతులు ఎప్పుడు డబ్బులు అడిగినా ఇచ్చేవారు. అంతేకాకుండా, ‘‘బంగారం.. నీ మెడలో మరీ ఇంత సన్న గొలుసు ఉందేంటి? అది తీసివ్వు, నీకు పెద్ద గొలుసు చేయిస్తాను’’ అంటూ నమ్మించి వారి వద్ద ఉన్న బంగారాన్ని కాజేసి ఆ తర్వాత మొహం చాటేసేవాడు.
మోసపోయిన 20 మంది యువతులు..
నిందితుడు ఏకంగా 20 మందికి పైగా యువతులను మోసం చేసి, సుమారు 40 తులాలకు పైగా బంగారాన్ని లాక్కున్నాడు. ఈ బంగారాన్ని తన స్నేహితుడు భరత్‌కుమార్ సాయంతో విక్రయిస్తున్నట్లు తేలింది. బాధితుల్లో ఓ యువతి పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు 2023 నుంచి ఇదే తరహాలో మోసాలకు పాల్పడుతున్నానని, గతంలోనూ పలు పీఎస్‌ల్లో కేసులు నమోదై జైలుకు వెళ్లొచ్చినట్లు పోలీసుల విచారణలో సాగర్చౌదరి అంగీకరించాడు.
