- క్యూర్, ప్యూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో భూములిచ్చిన వారికి వర్తింపు
- అథారిటీ పరిధిలో ఎక్కడైనా వినియోగం, బదలాయింపునకు అవకాశం
- పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలు
- గెజిట్ వచ్చిన తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) చేపట్టే వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం, సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్) ప్రాంతాల్లో ప్రాజెక్టుల కోసం భూములు అప్పగించే వారికి ఇకపై హెచ్‌ఎండీఏనే నేరుగా ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్లను జారీ చేయనుంది.
ఇదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భూములను అవసరమైన మేరకు అప్పగించినా హెచ్‌ఎండీఏనే టీడీఆర్ సర్టిఫికెట్ జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ భవన నిర్మాణ నిబంధనలు–2012లోని రూల్ 17(సి)కి సవరణ చేస్తూ ఎంఏయూడీ శాఖ శుక్రవారం జీవో 218ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తెలంగాణ గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో రోడ్లు, ఇతర ప్రాజెక్టుల కోసం భూముల సేకరణకి సంబంధించి పరిహారం అందించడంలో టీడీఆర్ కీలకంగా ఉంది. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంపీలతో పాటు పలు లోకల్ బాడీల్లోనూ హెచ్‌ఎండీఏ చేపట్టే పనులకు ఇదివరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు లేదా జిల్లాల కలెక్టర్లు భూసేకరణ కి సంబంధించి పరిహారాన్ని అందించేవారు. కానీ ఇకపై హెచ్ఎండీఏనే పరిహారం కింద టీడీఆర్‌ని అందించనుంది.
హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగం..
హెచ్‌ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్‌ను హెచ్‌ఎండీఏ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవడంతో పాటు ఇతరులకు బదలాయించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇందుకు తెలంగాణ భవన నిర్మాణ నిబంధనలు–2012తో పాటు అమల్లో ఉన్న ఇతర చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అదే విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోనూ అభివృద్ధి పనుల కోసం అవసరమైన భూములను అప్పగించిన సందర్భాల్లోనూ టీడీఆర్ సర్టిఫికెట్‌ను హెచ్‌ఎండీఏ జారీ చేయనుంది. టీడీఆర్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ అన్ని టీడీఆర్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్ ద్వారానే ప్రాసెస్ చేయాలని, జారీ చేసిన టీడీఆర్ సర్టిఫికెట్ లేదా సంబంధిత ప్రొసీడింగ్స్ కాపీని సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్ లోకల్ బాడీ లేదా ఎఫ్‌సీడీఏకు సమాచారంతో పాటు రికార్డు కోసం పంపుతుంది.
బిల్డ్ నౌలో ప్రత్యేక మార్పులు..
కొత్త నిబంధనలకు అనుగుణంగా బిల్డ్ నౌ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయనున్నారు. టీడీఆర్ దరఖాస్తుల ప్రాసెసింగ్, సర్టిఫికెట్ల జారీ, వాటి లెక్కలు, వినియోగ ప్రక్రియలను కొత్త నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. టీడీఆర్ బదలాయింపు, వినియోగానికి సంబంధించి ప్రభుత్వం గతంలోనూ నిబంధనల్లో మార్పులు చేసింది. 2019లో టీడీఆర్ బదలాయింపు, వినియోగానికి సంబంధించిన సవరణలు చేయగా, 2022లో రూల్ 17(సి)లోని ఓఆర్ఆర్ లిమిట్స్ స్థానంలో హెచ్‌ఎండీఏ అని చేర్చింది. తాజా సవరణతో క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన వారు, అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో భూములు ఇచ్చిన వారికి టీడీఆర్ జారీ చేసే అధికారం హెచ్‌ఎండీఏకు కల్పించారు.
