ఇరాన్‎కు 2 టన్నుల గోల్డ్, 3 బిలియన్ డాలర్ల క్యాష్, 15 విమానాలు ఇచ్చిన యూఏఈ

ఇరాన్‎కు 2 టన్నుల గోల్డ్, 3 బిలియన్ డాలర్ల క్యాష్, 15 విమానాలు ఇచ్చిన యూఏఈ

టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో తమను లక్ష్యంగా చేసుకోకుండా ఇరాన్‌‌ను బుజ్జగించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో 3 బిలియన్ డాలర్ల క్యాష్, 2 టన్నుల బంగారం, 15 విమానాలు ఇరాన్​కు బదిలీ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. 

యూఏఈ బ్యాంకుల్లో ఫ్రీజ్​అయిన బిలియన్ల డాలర్ల విలువైన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంతో పాటు, బంగారం, ప్యాసింజర్ విమానాలను ఇరాన్‌‌కు తరలించినట్టు టెహ్రాన్‌‌లోని పలు వర్గాలు తెలిపాయి. అలాగే, సుమారు 283 మిలియన్ డాలర్లు విలువ చేసే 2 టన్నుల బంగారాన్ని ఇరాన్‌‌కు చేరవేశారు. ఈ ట్రాన్స్​పోర్ట్ అంతా ఈ నెల 11, 12 తేదీల్లో యూఏఈకి చెందిన రాయల్ జెట్ విమానం ద్వారా జరిగింది. 

ఈ విమానం అబుదాబి నుంచి టెహ్రాన్‌‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయం, కరాజ్ లోని పయామ్ విమానాశ్రయానికి వెళ్లి ఈ ఆస్తులను అప్పగించినట్టు తెలిసింది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ తన వాణిజ్య విమాన సర్వీసులను కోల్పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని యూఏఈ కంపెనీల ద్వారా 15 సెకండ్ -హ్యాండ్ ప్యాసింజర్ విమానాల విక్రయానికి యూఏఈ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఈసీటీ ఏవియేషన్ సపోర్ట్ ద్వారా మాజీ సౌదియా బోయింగ్ 777 విమానాలు ఇరాన్‌‌కు చేరాయి.