అంబర్పేట్, వెలుగు: అంబర్‌పేట్‌లోని బేకరీ సంస్థ థియోబ్రోమా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సెంట్రల్ కిచెన్‌లో ఆహార భద్రతా అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కిచెన్‌లో పరిశుభ్రత లోపించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలు నిల్వ చేస్తున్నట్లు అధికారులు తేల్చారు. ఫ్రోజెన్ మాంసాన్ని మైనస్ 18 డిగ్రీలకు బదులుగా 6 డిగ్రీల వద్ద ఉంచారని గుర్తించారు.
గడువు ముగిసిన చికెన్ వింగ్స్, బూజు పట్టిన పదార్థాలను అక్కడికక్కడే పారవేశారు. మొత్తం 24 కేజీల బంగాళాదుంపలు, 60 కేజీల చాక్లెట్ కాలెట్స్‌ను ధ్వంసం చేశారు. ఏసీ నీరు కేక్‌లపై పడటం, మురికిగా ఉన్న బేకింగ్ ట్రేలు, మలంతో కలుషితమైన గుడ్లు వంటి లోపాలు వెలుగుచూశాయి.
సరైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ గడువు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లేబులింగ్ నిబంధనలు పాటించని ఉత్పత్తులను సీజ్ చేసి, సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ఆహార భద్రతా కమిషనరేట్ స్పష్టం చేసింది.
