మేం డబుల్ బెడ్రూం ఇండ్లు ఫ్రీగా ఇచ్చినం : బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్

మేం డబుల్ బెడ్రూం ఇండ్లు ఫ్రీగా ఇచ్చినం :  బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్
  •     ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం రూ.6 లక్షలు వసూలు చేస్తున్నది
  •     బీఆర్ఎస్​ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్​లా మారిందని బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారని, కానీ తాము హైదరాబాద్​లో 69 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఢిల్లీలోని ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్స్​ కూడా డబుల్ బెడ్రూం ఇండ్లలాగా లేవని నాటి గవర్నర్ అభినందించారని గుర్తుచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్​లో తలసాని మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కొల్లూరులో ఒక్కచోటే 16 వేల డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టామన్నారు. కేసీఆర్ కట్టిన ఒక్క డబుల్ బెడ్రూం ఇంటి ఖర్చు రూ.9.50 లక్షలని, లబ్ధిదారులు రూపాయి కట్టకుండా ఫ్రీగా ఇచ్చామన్నారు. 

ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారులు రూ.6 లక్షలు కట్టాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని మండిపడ్డారు. దరఖాస్తుకు రూ.10 వేల ఫీజు పెట్టారని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఫీజు పెట్టి ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. 22ఏ కింద మీ భూమి మీకే ఇప్పిస్తామని సీఎం చెప్పారని, అసలు ప్రజల భూమిని వారికి ఇవ్వడానికి రేవంత్​ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. 22ఏ ద్వారా 30 నుంచి 40 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని, పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను 22ఏ జాబితాలో చేర్చారంటూ ఆరోపించారు. అసలు మునుగోడు ఎమ్మెల్యే ఏం మాట్లాడారో రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు.