హైదరాబాద్, వెలుగు: గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం వాయిదా పడింది. ఈ నెల 18న జరగాల్సిన 18వ బోర్డు మీటింగ్‌ను కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే బోర్డు సమావేశానికి సంబంధించిన ఎజెండాను రెండు రాష్ట్రాలకు పంపించగా, అందులో ఏపీ చేర్చిన అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే అనుమతులు పొందిన కాళేశ్వరం, ఇంటిగ్రేటెడ్ సీతమ్మసాగర్, సీతారామసాగర్, చిన్నకాళేశ్వరం, మోడికుంటవాగు, చౌటపల్లి హనుమంతరెడ్డి లిఫ్ట్, చనాకా-కొరాటా, గూడెం లిఫ్ట్ ప్రాజెక్టుల అనుమతులను పునఃపరిశీలించాలని, సమ్మక్కసాగర్, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాలని ఏపీ ఎజెండాలో పేర్కొంది.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనుమతులు లభించిన ప్రాజెక్టులపై రివ్యూ చేయాలన్న ఏపీ డిమాండ్‌ను ఎజెండా నుంచి తొలగించాలని గోదావరి బోర్డుకు లేఖ రాసింది. ఈ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఏపీకి బోర్డు లేఖ రాసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఈ కారణంతో పాటు, సమావేశం నిర్ణయించిన అదే తేదీన కేంద్ర జలశక్తి శాఖ వద్ద కూడా జీఆర్ఎంబీ భేటీ ఉండడంతో మంగళవారం జరగాల్సిన మీటింగ్‌ను వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాన్ని మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపాయి.
