- ప్రస్తుతం సాగర్, శ్రీశైలంలో కలిపి
- 146.54 టీఎంసీలున్నయ్
- బేసిన్ లెక్కల పరంగా 71% వాటా
- తమదేనని తేల్చి చెప్పిన తెలంగాణ
- ఉన్న నీళ్లలో 115.75 టీఎంసీలు
- తమవన్న ఏపీ.. తెలంగాణకు
- 30 టీఎంసీలేనంటూ వాదన
- బోర్డు మీటింగ్ పెట్టకుండా
- త్రీమెన్ కమిటీ మీటింగ్
- పెట్టడంపై అనుమానాలు
హైదరాబాద్, వెలుగు: కృష్ణాలో ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి ఎగువన ఉన్న నీళ్లన్నీ తెలంగాణవేనని, ఏపీకి చుక్క కూడా లేవని తెలంగాణ తేల్చి చెప్పింది. ప్రస్తుతం సాగర్‌లో డెడ్ స్టోరేజ్‌కి ఎగువన వాడుకునేందుకు 17.79 టీఎంసీలు, శ్రీశైలంలో 128.75 టీఎంసీలు కలిపి మొత్తంగా 146.54 టీఎంసీల నీళ్లున్నాయని పేర్కొంది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ జనరల్ ఓవీ రమేశ్ బాబు లేఖ రాశారు.
నీళ్లలో తెలంగాణ వాటా 71 శాతమని, ఏపీది కేవలం 29 శాతమేనని తేల్చి చెప్పారు. కృష్ణా ఇన్బేసిన్ జనాభా, సాగు, కరువు ప్రాంతాల ఆధారంగా 71 శాతం నీళ్లు తెలంగాణకే చెందుతాయన్నారు. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 173.77 టీఎంసీలు వస్తాయని, ఇప్పుడు అందుబాటులో ఉన్న 146.54 టీఎంసీలు మొత్తం తమవేనని చెప్పారు. ఏపీకి చుక్క కూడా నీళ్లు లేవని లేఖలో ఈఎన్సీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు శ్రీశైలంలో కల్వకుర్తి ద్వారా 3.59 టీఎంసీలు, సాగర్‌లో 6.89 టీఎంసీలు వినియోగించుకున్నామని లేఖలో తెలిపారు.
2027 ఆగస్టు వరకు తెలంగాణ తాగునీటి అవసరాలు 50 టీఎంసీలని చెప్పారు. శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, ఏఎమ్మార్పీ కింద 25 టీఎంసీల చొప్పున తాగునీటి అవసరాలున్నాయని పేర్కొన్నారు. ఎల్‌నినో తీవ్రమయ్యే పరిస్థితులున్నాయని చెబుతున్నారని, దాని వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కామన్ రిజర్వాయర్లలోని జలాలను కేవలం తాగునీటికే ఇవ్వాలని, అవన్నీ తెలంగాణకే కేటాయించాలని స్పష్టం చేశారు.
తెలంగాణకు 30 టీఎంసీలు చాలన్న ఏపీ
కామన్ రిజర్వాయర్లలో ఉన్న నీళ్లలో తెలంగాణకు వచ్చేది 30 శాతమేనని, ఆ రాష్ట్రానికి 30 టీఎంసీలు చాలని పేర్కొంటూ ఏపీ కూడా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. తమకు మాత్రం 115.70 టీఎంసీల నీళ్ల వాటా ఉన్నదని పేర్కొంది. ఇప్పటిదాకా వాడుకున్న నీటి వివరాలనూ వెల్లడించింది. ఏపీ శ్రీశైలంలో 6.45 టీఎంసీలు, సాగర్‌లో 7.17 టీఎంసీలు వాడుకున్నట్టు తెలిపింది. అదే సమయంలో జూరాల నుంచి తెలంగాణ వాడుకున్న నీళ్లనూ లెక్కల్లో చూపించింది. అది కామన్ రిజర్వాయర్ కాకపోయినా 8.79 టీఎంసీలు వాడేసిందంటూ బుకాయించింది. మొత్తంగా తమకు అక్టోబర్ వరకు తాగునీటి అవసరాల కోసం 47 టీఎంసీలను కేటాయించాలంటూ లేఖలో ఏపీ డిమాండ్ చేసింది.
బోర్డు మీటింగ్ పెట్టకుండా త్రీమెన్ కమిటీ మీటింగేంటి..?
ప్రతి వాటర్ ఇయర్ ప్రారంభానికి ముందు కృష్ణా బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. బోర్డు మీటింగ్‌లో చర్చకు వచ్చిన అంశాల ఆధారంగా త్రీమెన్ కమిటీ మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. బోర్డులో నిర్ణయించిన అంశాలను మాత్రమే త్రీమెన్ కమిటీ అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు బోర్డు మీటింగ్ లేకుండానే నేరుగా త్రీమెన్ కమిటీ సమావేశం పెట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా బోర్డు కుట్రపూరితంగానే త్రీమెన్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బోర్డు సమావేశంలో అయితే.. కేఆర్‌ఎంబీ చైర్మన్, మెంబర్ సెక్రటరీ, టెక్నికల్ మెంబర్లు, రెండు రాష్ట్రాల సెక్రటరీలు, అధికారులు పాల్గొంటారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాడకం, వివాదాలపై బోర్డు మీటింగ్‌లోనే చర్చించి వాటాలు ఖరారు చేస్తారు. ఏకాభిప్రాయం కుదరని అంశాలను కేంద్రానికి నివేదిస్తారు. కానీ, ఇక్కడ డైరెక్ట్‌గా త్రీమెన్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోర్డులో చర్చించిన అంశాలపై చర్చించి అమలు పరిచేలా త్రీమెన్ కమిటీలో ఇండెంట్లు పెట్టి నీటి వాటాలు కోరుతారు.
13న నిర్వహించాల్సిన త్రీమెన్ కమిటీ మీటింగ్‌ను 17కు వాయిదా వేసింది. నేరుగా రాలేమని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతామని ఏపీ చెప్పడంతో తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మీటింగ్‌ను 17కు వాయిదా వేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. వీసీలో అయితే చెప్పని విషయాలను చెప్పినట్టు.. చెప్పిన విషయాలను చెప్పనట్టుగా ఏపీ బుకాయించే ప్రమాదం ఉండడంతో వీసీ వద్దని మన అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం.
