పోలీస్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్: ఎస్సై పోస్టులకు 37, కానిస్టేబుల్‌‌ పోస్టులకు 34 ఏండ్లు ఏజ్ లిమిట్ పెంపు

 పోలీస్ అభ్యర్థులకు బిగ్ రిలీఫ్: ఎస్సై పోస్టులకు 37, కానిస్టేబుల్‌‌ పోస్టులకు 34 ఏండ్లు ఏజ్ లిమిట్ పెంపు
  • కానిస్టేబుల్‌‌ పోస్టులకు 34 ఏండ్లు వరకు చాన్స్
  • ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్‌‌కు 38 ఏండ్లు
  • ఏఎంవీఐ పోస్టులకు గరిష్టంగా 41 సంవత్సరాలు
  • ఓపెన్ కేటగిరీకి ఏడేండ్లు.. 
  • రిజర్వేషన్ అభ్యర్థులకు 12 ఏండ్ల వరకు వయోపరిమితి సడలింపు

హైదరాబాద్, వెలుగు: యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, అటవీ, రవాణా శాఖల్లోని పలు పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచింది. ఇప్పటికే ఇచ్చిన ఐదేళ్ల సడలింపునకు ఈ రెండేళ్లు కలిపి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మొత్తం ఏడేళ్ల వయో సడలింపు లభించనుంది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల వారీగా చూస్తే.. కానిస్టేబుల్, ఫైర్‌‌‌‌మెన్, జైలు వార్డర్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్ల వరకు, ఎస్సై, సబ్ ఇన్‌‌‌‌స్పెక్టర్, డిప్యూటీ జైలర్, ఎస్ఎఫ్‌‌‌‌ఓ పోస్టులకు 32 ఏళ్ల వరకు వయోపరిమితి పెరగనుంది.

పోలీస్ శాఖలో తాజా సడలింపుతో కానిస్టేబుల్ పోస్టులకు 34 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 37 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్ పోస్టులకు 38 ఏళ్లు వరకు వయోపరిమితి ఉంటుంది. రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌‌‌‌స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టులకు 41 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. ఈ సడలింపు ఆయా శాఖల్లో ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు వర్తిస్తుంది.

రిజర్వేషన్ అభ్యర్థులకు 12 ఏళ్ల వరకు..

ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు మొత్తం ఏడేళ్ల సాధారణ వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు లభించే మరో ఐదేళ్ల రిజర్వేషన్ వయో సడలింపు కూడా దీనికి కలుస్తుంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ఠంగా 12 ఏళ్ల వరకు వయో వెసులుబాటు లభిస్తుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో వయస్సు దాటిపోతున్నామని నిరుద్యోగులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం మరో రెండేళ్ల సడలింపు ఇచ్చింది. దీంతో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, అటవీ, రవాణా శాఖల్లో రానున్న నియామకాల్లో వయస్సు కారణంగా అవకాశం కోల్పోయే అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే చాన్స్ దక్కనుంది.