భారత దేశ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టం: స్వాతంత్ర్య దినోత్సవాల్లో  తొలిసారి వందేమాతరం

భారత దేశ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టం: స్వాతంత్ర్య దినోత్సవాల్లో  తొలిసారి వందేమాతరం

న్యూఢిల్లీ: దేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది. అయితే, ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారి జాతీయ గేయం ‘వందేమాతరం’ను ఆలపించనున్నారు. వందేమాతరానికి 150 ఏండ్ల చరిత్ర పూర్తయిన సందర్భంగా.. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువ శక్తి పాత్రను కొనియాడుతూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్, ఆయన డిప్యూటీ సంజయ్ సేథ్, రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ శనివారం ఉదయం ఎర్రకోటకు చేరుకుని ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ సమయంలో 1721 ఫీల్డ్ బ్యాటరీకి చెందిన గన్నర్లు స్వదేశీ 105 మిల్లీమీటర్ లైట్ ఫీల్డ్ గన్స్‌‌తో 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసే కార్యక్రమానికి ఏకకాలంలో ఈ గన్ సెల్యూట్ నిర్వహించనున్నారు.

 త్రివర్ణ పతాక ఆవిష్కరణ అనంతరం ఆర్మీ బ్యాండ్ వందేమాతరం ఆలపించనుంది. ఆ తర్వాత జాతీయ గీతం వినిపించనుంది. ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసిన వెంటనే వైమానిక దళానికి చెందిన రెండు ఎంఐ-17 హెలికాప్టర్లు వేడుకల ప్రాంగణంపై పుష్పవర్షం కురిపించనున్నాయి. ఒక హెలికాప్టర్ జాతీయ జెండాను, మరొకటి ‘వందేమాతరం’ చిహ్నం ఉన్న జెండాను ప్రదర్శించనుంది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.  ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఆర్మీ బ్యాండ్ ‘వందేమాతరం’ ట్యూన్​ వాయిస్తుంది.