సైబర్ నేరగాళ్లు నన్నూ వదల్లే.. 6,7 గంటలు భయపెట్టిర్రు: నాగార్జున

సైబర్ నేరగాళ్లు నన్నూ వదల్లే.. 6,7 గంటలు భయపెట్టిర్రు: నాగార్జున

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తాను కూడా సైబర్ క్రైం బాధితుడినేనని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పేర్కొన్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరిట తనను, నార్కొటిక్స్ పార్సిల్‌‌‌‌ పేరిట తన కుటుంబ సభ్యులను సైబర్​ నేరగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని  చెప్పారు. సైబర్ నేరాలను కట్టడి చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని అభినందించారు. 

సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సురక్ష కా తిరంగా’ కార్యక్రమానికి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ అండ్‌‌‌‌ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ సహా పలువురు అధికారులు పాల్గొని, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
నన్ను బిజినెస్‌‌‌‌ స్మార్ట్‌‌‌‌ అన్నారు.. 

ఇంట్లో ఒకరిని డిజిటల్ అరెస్ట్‌‌‌‌ చేశారు  

ఐదేండ్ల క్రితం బ్యాంక్ అధికారినంటూ ఓ వ్యక్తి తనకు ఫోన్​ చేశాడని నాగార్జున చెప్పారు.‘‘నాగార్జున గారు మీరు బిజినెస్‌‌‌‌లో చాలా స్మార్ట్‌‌‌‌ అని విన్నాను. మరి ఇన్వెస్ట్​మెంట్స్​ ఎందుకు చేయట్లేదు. మా వద్ద చాలా లాభాలు వస్తాయి’’ అంటూ నన్ను ఫ్రీజ్ చేయబోయాడని చెప్పారు. తమ ఆర్థిక వ్యవహారాలన్నీ మేనేజర్ చూసుకునేవాడని, కానీ తను నా పేరు చెప్పే సరికి ఓ దశలో నమ్మేశానన్నారు. ‘‘మా కుటుంబంలో ఒకరిని 6-,7 గంటల పాటు డిజిటల్ అరెస్టు చేశారు.

 విదేశాలకు నార్కోటిక్ సబ్​స్టాన్స్ పార్సిల్ పంపారంటూ కాల్స్ చేశారు. ఆ ఘటన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఈ విషయం సీవీ ఆనంద్‌‌‌‌కు తెలుసు” అంటూ డిజిటల్ మోసాలపై తన వ్యక్తిగత అనుభవాన్ని వెల్లడించారు. ఫోన్ హ్యాక్ అవుతుందనే భయం ఎప్పుడూ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.‘‘ఫోన్​ విషయంలో నేను ఎంతో జాగ్రత్తగా ఉంటా. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మొబైల్ ఫోన్‌‌‌‌ పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌, నెల రోజులకు ఒకసారి వైఫై పాస్‌‌‌‌వర్డ్‌‌‌‌ మార్చేస్తా. వ్యక్తిగత ఫొటోలను మొబైల్ ఫోన్‌‌‌‌లో సేవ్ చేసుకోను’ అని నాగార్జున స్పష్టం చేశారు.
సైబర్ బాధితుల్లో రిటైర్డ్‌‌‌‌ 

ఉద్యోగులే అధికం: డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌

సైబర్ నేరాల బారినపడుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులే అధికంగా ఉంటున్నారని డీజీపీ సీవీ ఆనంద్  తెలిపారు. ఈ క్రమంలోనే సురక్ష కా తిరంగా కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లను భాగస్వాములుగా చేశామని వెల్లడించారు. వీరితో పాటు ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో భౌతిక దోపిడీలు ఎక్కువగా జరిగేవని, ప్రస్తుతం నార్కోటిక్, సైబర్ నేరాలు పెరిగిపోయాయన్నారు. 

డ్రగ్స్, గంజాయి లాంటి నార్కొటిక్స్ బారినపడి విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. సైబర్ నేరాల్లో నష్టపోయిన బాధితులు కొంతమంది ఫిర్యాదు చేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. సమాజం ఏమనుకుంటుందోననే భయంతోనే చాలామంది తాము మోసపోయిన విషయం బయటకు చెప్పుకోలేకపోతున్నారని చెప్పారు.

సైబర్ నేరాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత: నాగార్జున

ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే కంప్యూటర్లపై తనకు అవగాహన ఉన్నదని నాగార్జున వివరించారు. ప్రొఫెసర్లు మాల్‌‌‌‌వేర్, హ్యాకింగ్ ప్రమాదాల గురించి హెచ్చరించేవారని గుర్తుచేసుకున్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండడం, వాటిని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

సినీ ఇండస్ట్రీలో పైరసీ భూతాన్ని తరిమికొట్టడంలో సీవీ ఆనంద్, వీసీ సజ్జనార్ విశేష కృషి చేశారన్నారు. పైరసీ నియంత్రణలో తెలంగాణ పోలీసులు నంబర్​ వన్​గా నిలిచారని ప్రశంసించారు. తెలంగాణ పోలీసుల చర్యల వల్లే తెలుగు పరిశ్రమతోపాటు మొత్తం భారతీయ సినీ పరిశ్రమకు మేలు జరిగిందని నాగార్జున కొనియాడారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో కలిసి సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.