ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి..ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించాలి

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి..ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించాలి
  •     పేదల విద్య కోసం నిర్మాణాత్మక ఉద్యమాలకు శ్రీకారం చుడతాం
  •     రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి 

పంజాగుట్ట, వెలుగు: ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలని రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారి ఆకునూరి మురళి అన్నారు. పేదల విద్య కోసం తెలంగాణ పీపుల్స్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ ఆధ్వర్యంలో నిర్మాణాత్మక ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో తెలంగాణ పీపుల్స్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ ఆధ్వర్యంలో ‘ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ–ప్రభుత్వ బడుల బలోపేతం’ అంశంపై నిర్వహించిన రౌండ్‌‌‌‌టేబుల్‌‌‌‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను ఆయా స్కూళ్ల నిర్వహణ వ్యయం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు అనుగుణంగా నిర్ణయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు అందించే విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించరాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తే విదేశాలతో సమానమైన విద్యను పేద విద్యార్థులకు అందించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు.

విద్యకు 15 శాతం బడ్జెట్​కేటాయించాలి

ప్రైవేట్​స్కూళ్లలో టర్మ్‌‌‌‌ ఫీజులతో పాటు అడ్మిషన్‌‌‌‌ ఫీజు, బిల్డింగ్‌‌‌‌ ఫండ్‌‌‌‌ పేరుతో వసూళ్లు చేయడం సరికాదన్నారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లిస్తున్నా ఆశించిన స్థాయిలో నాణ్యమైన విద్య అందడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. కాంగ్రెస్‌‌‌‌ మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం బడ్జెట్‌‌‌‌ కేటాయిస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొఠారి కమిషన్‌‌‌‌ సిఫారసుల ప్రకారం విద్యకు 15 శాతం బడ్జెట్‌‌‌‌ కేటాయించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. 

ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌‌‌‌లో విద్యకు సుమారు 8 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని, దీంతో విద్యారంగంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యం కావడం లేదన్నారు. సమావేశంలో తెలంగాణ పీపుల్స్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ కోర్‌‌‌‌ కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌‌‌‌ పద్మజ, రిటైర్డ్‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌ అధికారులు ఎంవీ రెడ్డి, మాలోత్‌‌‌‌ చంపాలాల్‌‌‌‌, సామాజిక కార్యకర్తలు రుబీనా, తమ్మినేని నిర్మల, ముప్పరి కురుమన్న, పరీత, సృజన యాదవ్‌‌‌‌ పాల్గొన్నారు.