- బొల్లా కిరణ్ గ్యాంగ్‌కు సహకరించినవారిపై మొదలైన విచారణ
- ఎస్సై, కొందరు కానిస్టేబుళ్లపై చర్యలకు రంగం సిద్ధం
- లోతుగా ఆరా తీస్తున్న ఈగల్ ఫోర్స్
హైదరాబాద్, వెలుగు: బాలానగర్ కేంద్రంగా సాగుతున్న బొల్లా కిరణ్ బ్రదర్స్ గంజాయి దందా పోలీసుల మెడకు చుట్టుకుంది. కొంత కాలంగా బొల్లా బ్రదర్స్‌కు సహకరిస్తూ.. గంజాయి నిల్వలు ఉంచిన ఇంట్లోనే పార్టీలకు హాజరైన ఓ ఎస్సైతో పాటు పలువురు కానిస్టేబుల్స్‌పై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ జరుపుతున్నారు. ఈగల్ ఫోర్స్ అధికారుల సోదాలకు వెళ్లినప్పుడు మరో కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడని, పోలీసుల రాకను గుర్తించి తప్పించుకున్నాడని తెలిసింది. బాలానగర్‌లో గంజాయి స్థావరంపై గురువారం ఈగల్ ఫోర్స్ అధికారులు సోదాలకు వెళ్లగా, గంజాయి గ్యాంగ్ వారిమీదికి కుక్కలను ఉసిగొల్పడం.. స్క్రూడ్రైవర్‌తో దాడికి పాల్పడడం వంటి ఘటనలు జరిగాయి.
ఆ టైంలో పారిపోయేందుకు బిల్డింగ్ మీది నుంచి దూకిన బొల్లా కిరణ్‌కు రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్చారు, మిగితా నిందితులందరినీ శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలోనే బొల్లా బ్రదర్స్ ముఠాతో కలిసి పార్టీలు చేసుకున్న సమయంలో అక్కడే వదిలి వెళ్లిన పోలీస్ మ్యాన్ ప్యాక్‌ను ఈగల్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మ్యాన్‌ప్యాక్ ఎవరు తీసుకొచ్చారనే వివరాలు సేకరిస్తున్నారు. ఈ గ్యాంగ్‌తో సంబంధాలున్న మరో ఐదుగురు కానిస్టేబుళ్ల పాత్రపైనా అంతర్గత విచారణ కొనసాగుతోంది.
యువతులు, మహిళలను ట్రాప్ చేసి దందా
ఈ ముఠాలో కీలక నిందితుడైన కిరణ్.. పలువురు మహిళలు, యువతులతో అక్రమ సంబంధాలు కొనసాగించడంతోపాటు వారందరినీ తన ఆధీనంలో పెట్టుకుని, చిత్రహింసలకు గురి చేసినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. గతంలో వరంగల్‌కు చెందిన ఓ మహిళను కిరణ్ పెళ్లి చేస్కుని విడాకులు ఇచ్చినట్లు గుర్తించారు. ఆ తర్వాత వరంగల్ ప్రాంతానికి చెందిన మరో యువతిని తన ఇంటికి తీసుకొచ్చాడు. మళ్లీ మొదటి భార్యతోనూ కాపురం చేశాడు.
వీరిద్దరితోపాటు మరికొందరు యువతులను తన ట్రాప్‌లో పెట్టుకున్నట్లు, వారిలో ఒకరి ఖాతాలోకి గంజాయి లావాదేవీల సొమ్మను జమ చేసేవాడని ఈగల్ ఫోర్స్ దర్యాప్తులో తేలింది. ఒడిశా నుంచి ప్రతి రోజు 31 మంది.. బొల్లా బ్రదర్స్‌కు గంజాయి సప్లయ్ చేస్తున్నట్లు గుర్తించారు. ట్రాప్ చేసిన యువతుల పేర్లపై సిమ్‌కార్డులు మెయింటేన్ చేస్తూ రోజుకు 25 వరకు ఆర్డర్లు డెడ్‌డ్రాప్ విధానంలో సప్లయ్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. గంజాయి కస్టమర్లుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్న కాల్ లిస్టును ఈగల్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
