- రికార్డులు మారుస్తున్నారంటూ తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన
- రైతులకు అండగా ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్, మల్లారెడ్డి
శామీర్‌పేట, వెలుగు: బొమ్మరాసిపేట భూముల రికార్డులను తారుమారు చేస్తున్నారంటూ రైతులు శుక్రవారం శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. 1,049 ఎకరాల రైతుల భూముల రికార్డులను భూమాఫియా, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై మారుస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ మనుచౌదరి, మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్, ఆర్డీవో నల్ల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి పేర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. రైతులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండాలని కేసీఆర్, కేటీఆర్ ఆదేశించడంతో ఇక్కడికి వచ్చామని తెలిపారు.
2023లో మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి బొమ్మరాసిపేట భూముల వ్యవహారంపై కలెక్టర్‌కు లేఖ రాశారని గుర్తుచేశారు. ధరణిని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారతి పేరుతో రికార్డులు మారుస్తోందని ఆరోపించారు. రైతుల భూములను ఇతరుల పేర్లకు ఎలా బదలాయిస్తారని మల్లారెడ్డి ప్రశ్నించారు. కోదండరాం ఈ భూములపై సర్వే చేసి నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రైతులపై దాడులు జరుగుతున్నాయని ఇద్దరు నేతలు ఆరోపించారు. ఇదే సమయంలో మాజీ సీఎం కేసీఆర్ కాన్వాయ్ సుచిత్ర వైపు వెళ్తుండగా రైతులు ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ కాన్వాయ్ వేగంగా వెళ్లడంతో కేసీఆర్ వారికి చేయి ఊపుతూ వెళ్లారు.
