హైదరాబాద్, వెలుగు: ఈనెల 23లోగా ఈకేవైసీ చేసుకోవాలని పెండింగ్‌లో ఉన్న ఎల్‌పీజీ వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మెసేజ్‌లు పంపుతున్నాయి. గతంలో ఇచ్చిన గడువును వినియోగదారుల రద్దీ దృష్ట్యా ఈనెల 23 వరకు పొడిగించినట్లు పేర్కొన్నాయి. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయకపోతే, ఆ తర్వాత డొమెస్టిక్ ధరకు ఎల్‌పీజీ సిలిండర్ పొందేందుకు అర్హత ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి. ఇలా మెసేజ్‌లు పంపించిన అనంతరం 56 లక్షల మంది వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నట్లు హెచ్‌పీసీఎల్ తెలిపింది.
వినియోగదారులు 'హెచ్‌పీ పే' యాప్ ద్వారా, తమ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద లేదా డెలివరీ సిబ్బంది ద్వారా ఉచితంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు వినియోగదారులు వీలైనంత త్వరగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించింది.
