దారికొస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు...ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌లో ఐదేండ్ల ఫీజు వసూళ్లకు బ్రేక్

దారికొస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు...ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌లో ఐదేండ్ల ఫీజు వసూళ్లకు బ్రేక్
  •     అదనంగా తీసుకున్న 6 నెలల సొమ్ము వాపస్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
  •     2021 బ్యాచ్ విద్యార్థులకు రీఫండ్ ప్రకటించిన మహేశ్వర మెడికల్ కాలేజ్‌‌‌‌‌‌‌‌
  •     మిగతా యాజమాన్యాలపైనా పెరుగుతున్న ఒత్తిడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్డగోలు వసూళ్లకు ఎట్టకేలకు తెరపడుతున్నది. రూల్స్ ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి 4.5 ఏండ్లు (54 నెలలు) కాగా, యాజమాన్యాలు మాత్రం ఐదేండ్ల పూర్తి ఫీజును వసూలు చేస్తూ విద్యార్థుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. అయితే, కోర్టు తీర్పులు, ప్రభుత్వ చర్యలు, పేరెంట్స్, స్టూడెంట్ అసోసియేషన్ల పోరాటంతో మెడికల్ కాలేజీలపై ఒత్తిడి పెరిగి దారికొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పటాన్‌‌‌‌‌‌‌‌చెరులోని మహేశ్వర మెడికల్ కాలేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 బ్యాచ్ విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఆరు నెలల ఫీజును రీఫండ్ ఇస్తామని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 15 నుంచి 30లోగా ఈ సొమ్మును నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తామని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది.

స్టైపెండ్ ఇవ్వకుండా అదనపు దోపిడీ..

వాస్తవానికి ఎంబీబీఎస్ కోర్సు ముగిసిన తర్వాత ఒక ఏడాది పాటు హౌస్ సర్జన్ (ఇంటర్న్‌‌‌‌‌‌‌‌షిప్) చేయాలి. ఈ కాలంలో కాలేజీలే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వాల్సి ఉన్నా, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్లే ఫీజుల పేరిట లక్షల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయి. కన్వీనర్ కోటాలో రూ.50 వేలు, బీ కేటగిరీలో రూ.7 లక్షలు, ఎన్నారై కోటాలో రూ.15 లక్షల వరకు అదనపు భారం వేస్తున్నాయి. అడ్మిషన్ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే ముందస్తు చెక్కులు, బాండ్లు రాయించుకోవడమే కాకుండా.. ఫీజు కట్టకపోతే హాల్‌‌‌‌‌‌‌‌టికెట్లు ఇవ్వబోమని, ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌కు అటెండ్‌‌‌‌‌‌‌‌ కానివ్వమని విద్యార్థులను బ్లాక్‌‌‌‌‌‌‌‌ మెయిల్ చేస్తున్నాయి. మరోవైపు, మహేశ్వర కాలేజీ నిర్ణయంతో ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై కూడా తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మిగిలిన కాలేజీలు కూడా అదే బాటలో అదనపు ఫీజును వాపస్ ఇవ్వాలని విద్యార్థి, పేరెంట్స్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి అన్ని కాలేజీల్లో రీఫండ్ ప్రక్రియ జరిగేలా చూడాలని కోరుతున్నారు. 

మిగతా కాలేజీలూ రీఫండ్ చేయాల్సిందే.. 

మహేశ్వర కాలేజీ రీఫండ్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయం. నాలుగున్నరేండ్ల ఫీజు కంటే ఎక్కువ వసూలు చేసిన కాలేజీలన్నీ విద్యార్థులకు రీఫండ్ చేయాలి. అదనపు ఫీజు కోసం అటెండెన్స్ వేయని కాలేజీలు వారికి అటెండెన్స్ వేయాలి. లేకపోతే కాలేజీల గుర్తింపు రద్దు చేయించేలా పోరాటం చేస్తాం.
‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- మల్లోజు సత్యనారాయణ చారి, పేరెంట్స్ అసోషియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్