- మజ్లిస్ నేతలను చర్లపల్లి జైలుకు పంపే దమ్ము సీఎంకు ఉందా?
- తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు: వందేమాతరం గీతాన్ని వ్యతిరేకిస్తున్న మజ్లిస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసు కోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎంకు దమ్ము, ధైర్యం ఉంటే మజ్లిస్ నేతలను దారుస్సలాం నుంచి చర్లపల్లి జైలుకు తరలించాలని సవాల్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై భారీ తిరంగా యాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత యాత్ర ప్రారంభమైంది.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, సినీ నటుడు సాయి కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు జాతీయ జెండాలతో యాత్ర సాగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రక్తపాతం, ఉగ్రవాదం పెరగాలని కొన్ని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నాయని ఆరోపించారు. దేశ ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ గెలవాలని కోరుకున్న పార్టీలను ప్రజలు గమనించారని చెప్పారు.
కేబినెట్‌లో జెన్ జీకి అవకాశం ఇవ్వాలి: బండి
21 ఏండ్లకే చట్టసభల్లోకి వచ్చే అవకాశం కల్పించే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ జెన్ జీకి మంత్రి పదవులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టికెట్లలో అవకాశం ఇవ్వాలని సూచించారు. స్వాతంత్ర్య పోరాటం, త్యాగాల గురించి యువత తెలుసుకోవాలని చెప్పారు. రాంచందర్ రావు మాట్లాడుతూ దేశం కోసం త్యాగం చేసే స్ఫూర్తి అందరిలో ఉండాలని కోరారు. లక్ష్మణ్ మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం ఏదైనా ముందుగా అందరూ భారతీయులేనన్నారు. ప్రతి పౌరుడు జాతీయ జెండాను గౌరవించాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కోరారు.
