- 8 జిల్లాల్లోని 67 కేంద్రాల్లో మూడు అంచెల్లో ఘాట్ల అభివృద్ధి
- సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణకు ప్రత్యేక ‘డ్యాష్‌బోర్డు’ ఏర్పాటు
- క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రుల దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడేలా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది. గోదావరి పరీవాహక ప్రాంతాలైన నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 67 పుష్కర ఘాట్లను మూడు అంచెల్లో అభివృద్ధి చేస్తామని పేర్కొంది.
శుక్రవారం సచివాలయంలో క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు కొండా సురేఖ, గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల పనులను సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఆగస్టు చివరి నాటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పుష్కరాల పనుల పురోగతిని సమీక్షించేందుకు వీలుగా శాఖలవారీగా వివరాలతో కూడిన ప్రత్యేక డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే టైర్–1 ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను, కీలక ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆలయాల విశిష్టతను తెలిపే స్వాగత తోరణాలు..
నదీ జలాల్లో ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు కలవకుండా చూడాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. ఆలయాల విశిష్టతను తెలిపే స్వాగత తోరణాలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల సహకారంతో వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు. పంచాయతీరాజ్, రోడ్లు అండ్ భవనాలు, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని తట్టుకునేలా తాత్కాలిక బస్ షెల్టర్లు, హోల్డింగ్ ఏరియాలు, భారీ పార్కింగ్ స్థలాలు సిద్ధం చేయాలని, బస్టాండ్లను పుష్కర శోభతో ముస్తాబు చేయాలని అధికారులకు సూచించారు.
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఘాట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాచార పౌర సంబంధాల శాఖ తరఫున ప్రచార కార్యక్రమాలను గోదావరి పుష్కరాల ప్రారంభానికి మునుపే ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
