హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించలేకపోతున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. తన నియోజకవర్గానికి మంత్రులు నిధులు కేటాయించడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మహేశ్ గౌడ్ స్పందించారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేశారని, ఆ విషయం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలియదని తాను అనుకోవడం లేదన్నారు.
ఆ అప్పులే పోచారం లాంటి వారికి నిధులివ్వడానికి అడ్డంకిగా మారాయని.. దీన్ని పోచారం అర్థం చేసుకోవాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. 2018 నుంచి అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ అయిందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, పార్టీలో ఎంత పెద్ద లీడర్ అయినా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ లో సీఎం అయినా, సామాన్య కార్యకర్త అయినా ఒకే నిబంధన వర్తిస్తుందన్నారు. రాజగోపాల్ రెడ్డి పార్టీ లైన్ దాటి మాట్లాడడం వల్ల దీన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి ఎవరి సేవలను ఎప్పుడు వినియోగించుకోవాలో కాంగ్రెస్ నాయకత్వానికి తెలుసన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
మంత్రి శ్రీధర్‌బాబు చెప్పిందే ఫైనల్..
భూ కేటాయింపుల విషయంలో మంత్రి శ్రీధర్ బాబు చెప్పిందే ఫైనల్ అని పీసీసీ చీఫ్ చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన భూ కేటాయింపులను పరిశీలిస్తే.. గతంలో పాలించిన వారు ఏ రేటుకు భూములిచ్చారు? తాము ఏ ధరకు భూములు ఇస్తున్నామనే విషయం స్పష్టమవుతుందన్నారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి భూముల కేటాయింపు అంశంపై మంత్రి శ్రీధర్ బాబు చెప్పిందే ఫైనల్ అన్నారు. గెలిచే వారికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తామని, అభ్యర్థుల ప్రకటన హైకమాండ్ చేస్తుందన్నారు.
