- నవంబర్‌లో ఖాళీ కానున్న మూడు స్థానాలు.. రేసులో 30 మందికి పైగా సీనియర్లు
- గ్రాడ్యుయేట్ స్థానాలపై యువ నేతలు, గవర్నర్ కోటాపై మాజీల గురి
- హైకమాండ్, సీఎం రేవంత్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అప్పుడే కోలాహలం మొదలవగా.. ఆ ఎన్నికల కన్నా ముందే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు మూడు ఖాళీ కానుండడంతో ఇప్పుడు అందరి దృష్టి వీటిపై పడింది. వచ్చే ఏడాది మార్చిలో వరం గల్– నల్గొండ– ఖమ్మం, హైదరాబాద్– రంగారెడ్డి– మహబూబ్ నగర్, ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవుల కోసం పలువురు సీనియర్లు, యువ నేతలు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల కంటే ముందే అంటే ఈ ఏడాది నవంబర్ 14న గవర్నర్ కోటాలోని మూడు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. అందులో గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ఉన్నారు. ఈ మూడు సీట్లపై కాంగ్రెస్‌లో పలువురు సీనియర్ నేతలు దృష్టిపెట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో సహజంగానే ఆ పార్టీ సిఫారసు చేసిన నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఉంటుంది. అయితే, ఇది గవర్నర్ కోటా కావడంతో కాంగ్రెస్‌లోనే వివిధ రంగాల్లో అనుభవం ఉన్నవారినే హైకమాండ్ సిఫారసు చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్‌లో యువ నేతలు పోటీ పడుతుం డగా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో సీని యర్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందేమోననే చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ మూడు పదవుల కోసం కాంగ్రెస్‌లో కనీసం 30 మంది వరకు ఆశలు పెట్టుకున్నారు
