భారత్‌కు లంక స్పిన్ టెస్ట్.. ఇవాళ్టి (ఆగస్ట్ 15) నుంచే గాలే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్

భారత్‌కు లంక స్పిన్ టెస్ట్.. ఇవాళ్టి (ఆగస్ట్ 15) నుంచే గాలే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్

గాలె: శ్రీలంకతో తొలి టెస్ట్‌‌కు టీమిండియా రెడీ అయ్యింది. శనివారం నుంచి జరిగే ఈ పోరులో లంక స్పిన్నర్ల నుంచి కఠిన సవాలు ఎదురుకానుంది. అదే టైమ్‌‌లో రెడ్‌‌బాల్‌‌ క్రికెట్‌‌లో పెద్దగా విజయాలు సాధించలేకపోతున్న హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్‌‌ గంభీర్‌‌ భవిష్యత్‌‌ కూడా ఈ సిరీస్‌‌పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. 

గౌతీ నేతృత్వంలో చాంపియన్స్‌‌ ట్రోఫీ, ఆసియా కప్‌‌, టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో అద్భుత విజయాలు సాధించిన ఇండియా వైట్‌‌బాల్‌‌ (పరిమిత ఓవర్లు) క్రికెట్‌‌లో తిరుగులేని శక్తిగా నిలిచింది. కానీ టెస్ట్‌‌ల్లో మాత్రం పరిస్థితి ఆశాజనకంగా లేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌‌, సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయాలు ఇండియా ‘వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌’ ఆశలకు గండి కొట్టాయి. 

సీనియర్లపైనే భారం..

యంగ్‌‌ కెప్టెన్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ సారథ్యంతో పాటు జట్టులో ఉన్న అనుభవజ్ఞులకు ఈ సిరీస్‌‌ ఓ పరీక్ష కానుంది. ముఖ్యంగా స్పిన్‌‌ను జయించే వ్యూహాలను యంగ్‌‌స్టర్స్‌‌కు నేర్పించాల్సిన బాధ్యత వీళ్లపై ఉంది. తుది జట్టులో కూడా ఎక్కువ మంది బ్యాటర్లకు చాన్స్‌‌ ఇవ్వనున్నారు.

ఓపెనర్లుగా రాహుల్‌‌, యశస్వి జైస్వాల్‌‌ బరిలోకి దిగుతుండగా, గాయంతో సిరీస్‌‌కు దూరమైన సాయి సుదర్శన్‌‌ మూడో ప్లేస్‌‌లో దేవదత్‌‌ పడిక్కల్‌‌ ఆడనున్నాడు. నాలుగో ప్లేస్‌‌లో గిల్‌‌, వికెట్‌‌ కీపర్‌‌గా రిషబ్‌‌ పంత్‌‌, స్పెషలిస్ట్‌‌ బ్యాటర్‌‌గా ధ్రువ్‌‌ జురెల్‌‌ ప్లేస్‌‌లను ఖాయం చేసుకున్నారు. 

దాంతో సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ బెంచ్‌‌కే పరిమితం కానున్నాడు. లంక పిచ్‌‌లపై బౌలర్లు ఎంత త్వరగా లయను అందుకుంటే అంత మంచిది. పిచ్‌‌ను బట్టి ముగ్గురు స్పిన్నర్లు కుల్దీప్‌‌ యాదవ్‌‌, మానవ్‌‌ సుతార్‌‌, జడేజాను బరిలోకి దించే చాన్స్‌‌ ఉంది. ప్రధాన పేసర్‌‌గా సిరాజ్‌‌, తోడుగా ప్రసిధ్‌‌ కృష్ణను తీసుకోవచ్చు.

డిక్వెల్లాపైనే ఆశలు..

ఈ మ్యాచ్‌‌ కోసం లంక కూడా పకడ్బందీగా వ్యూహాలు సిద్ధం చేసింది. 54 టెస్ట్‌‌లు ఆడిన నిరోషన్‌‌ డిక్వెల్లాను తిరిగి జట్టులోకి తీసుకుంది. లాహిరు, నిషాన్‌‌ ఫెర్నాండో, దినేశ్‌‌ చండిమల్‌‌, కమింద్‌‌ మెండిస్‌‌ బ్యాట్లు ఝుళిపిస్తే ఇండియా బౌలర్లకు కష్టాలు మొదలైనట్లే. బౌలింగ్‌‌లో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల వ్యూహాన్నే అమలు చేయనుంది. దాంతో బ్యాటింగ్‌‌ సామర్థ్యం ఉన్న స్పిన్నర్‌‌ సోనల్‌‌ దినుషా తుది జట్టులోకి రానున్నాడు. 

తుది జట్లు (అంచనా)

ఇండియా: శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (కెప్టెన్‌‌), కేఎల్‌‌ రాహుల్‌‌, యశస్వి జైస్వాల్‌‌, దేవదత్‌‌ పడిక్కల్‌‌, రిషబ్‌‌ పంత్‌‌, ధ్రువ్‌‌ జురెల్‌‌, జడేజా, మానవ్‌‌ సుతార్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌, సిరాజ్‌‌, ప్రసిధ్‌‌ కృష్ణ. 

శ్రీలంక: ధనంజయ డి సిల్వా (కెప్టెన్), లహిరు ఇగలగమగే, నిషాన్ ఫెర్నాండో, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, సోనాల్ దినుషా, ప్రభాత్ జయసూర్య, రమేష్ మెండిస్, ఆషితా ఫెర్నాండో, లాహిరు కుమార. 

పిచ్‌‌, వాతావరణం

బ్యాటింగ్‌‌కు అనుకూలించే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా పిచ్‌‌ను ఎక్కువగా ఆరబెట్టలేకపోయారు. మ్యాచ్‌‌ గడిచే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపొచ్చు. మ్యాచ్‌‌కు వర్షం ముప్పు ఉంది. 

అరుదైన గౌరవం

టీమిండియా చారిత్రక 600 టెస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌కు నాయకత్వం వహించడం నాకు లభించిన అరుదైన గౌరవం. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మ్యాచ్‌‌ జరగడం మరింత ప్రత్యేకం. అయితే వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ రేసులో నిలవాలంటే మేం ఆడబోయే 9 టెస్ట్‌‌ల్లో కనీసం 6 లేదా 7 మ్యాచ్‌‌ల్లో గెల వాలి. ఈ నేపథ్యంలో లంకతో రెండు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌ మాకు చాలా కీలకం. పేసర్‌‌ గుర్నూ ర్‌‌ బ్రార్‌‌ పాత బంతితో అద్భుతంగా ఆడు తున్నాడు.

 కానీ ప్రసిధ్‌‌ కృష్ణ కూడా బౌలింగ్‌‌ బా గా చేస్తున్నాడు. ఈ ఇద్దరిలో ఎవర్ని ఎంచు కోవాలనేది పిచ్‌‌ పరిస్థితులను బట్టి ఉంటుంది. టెస్ట్‌‌ మ్యాచ్‌‌ స్వభావం కాస్త నెమ్మదిగా ఉం టుంది. కాబట్టి ఉపఖండంలో వికెట్లు సాధిం చడానికి విభిన్నమైన వ్యూహాలు అమలు చేయాలి. తొలి రెండు రోజుల్లోనే ఎక్కువ అవకాశాలను సృష్టించుకోవాలి. వికెట్లు పడన ప్పుడు కొత్త తరహా ఫీల్డింగ్‌‌ను మోహరించాలి. కెప్టెన్సీ విషయంలో సౌకర్యవంతంగానే ఉన్నా. జట్టు కూడా సరైన దిశలోనే వెళ్తోంది. 
-  శుభ్‌‌మన్‌‌ గిల్‌‌

స్పిన్నర్లదే పైచేయి.. 

గాలెలో పర్యాటక జట్లు విజయం సాధించడం చాలా కష్టం. 1998 నుంచి ఇక్కడ జరిగిన 49 టెస్ట్‌‌ల్లో లంక 27సార్లు గెలిచింది. ఇందులో స్పిన్నర్లే కీలక పాత్ర పోషించారు. ముత్తయ్య మురళీధరన్‌‌, రంగన హెరాత్‌‌లాంటి దిగ్గజాలు ఎక్కువ విజయాలు సాధించిపెట్టారు. ఇప్పు డు ప్రభాత్‌‌ జయసూర్య, రమేశ్‌‌ మెండిస్‌‌ గాలెను తమ కంచుకోటగా మార్చుకున్నారు. కాబట్టి ప్రస్తుత గణాంకాలు, పరిస్థితులు ఇండియా బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలంగా లేవు. అయితే 2017లో చివరిసారి ఇక్కడ పర్యటించిన ఇండియా 3–0తో సిరీస్‌‌ను కైవసం చేసుకుంది. కాకపోతే విరాట్‌‌ కోహ్లీ నాయకత్వంలోని ఆడిన చాలా మంది ప్లేయర్లు ఇప్పుడు లేరు.