భారత్కి మరో బిగ్ షాక్..  ఆసియా కప్ నుంచి జెమీమా ఔట్.. రీప్లేస్‌మెంట్ ప్రకటించిన బీసీసీఐ

భారత్కి మరో బిగ్ షాక్..  ఆసియా కప్ నుంచి జెమీమా ఔట్.. రీప్లేస్‌మెంట్ ప్రకటించిన బీసీసీఐ

Jemimah Rodrigues Ruled Out: మహిళల ఆసియా కప్ 2026, ఆసియా గేమ్స్ టోర్నీలకు ముందు భారత ఉమెన్స్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా స్టార్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తీవ్ర గాయం కారణంగా రాబోయే ఈ రెండు ప్రతిష్టాత్మక టోర్నీల నుంచి తప్పుకుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో జెమీమా కుడి తొడ కండరాలకు (Hamstring) తీవ్ర గాయమైంది. ఈ గాయంతో ఆమె కొన్ని వారాల పాటు మైదానానికి దూరం కావాల్సి వచ్చింది.  

బెంగళూరు సీఓఈలో హై-గ్రేడ్ టియర్ నిర్ధారణ:

ఇంగ్లాండ్‌లో గాయపడిన అనంతరం భారతదేశానికి తిరిగొచ్చిన జెమీమాను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందం క్లినికల్‌గా పరిశీలించింది. వైద్య పరీక్షలలో జెమీమాకు కుడి తొడ కండరం తీవ్రంగా చిరిగినట్లు (High-grade tear) నిర్ధారణ అయ్యిందని, దీనివల్ల ఆమె కొన్ని వారాల పాటు ఆటకు దూరంగా ఉండక తప్పదని బీసీసీఐ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఈ నెల చివర్లో జరిగే ఆసియా కప్‌తో పాటు త్వరలో ప్రారంభమయ్యే ఆసియా గేమ్స్‌కు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు.

జెమీమా స్థానంలో ప్రతికా రావల్‌కు బంపర్ ఆఫర్:

జెమీమా రోడ్రిగ్స్ దూరమవ్వడంతో ఆమె స్థానంలో అన్‌క్యాప్డ్ బ్యాటర్ ప్రతికా రావల్‌ను బీసీసీఐ సెలెక్టర్లు భారత టీ20 జట్టులోకి సెలక్ట్ చేశారు. 2025 వన్డే ప్రపంచకప్ విజయంలో 48.56 సగటుతో 2 సెంచరీలు చేసి కీలక పాత్ర పోషించిన ప్రతికా, గాయం కారణంగా ఆ ప్రపంచకప్ సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు దూరమైంది. ఇప్పుడు జెమీమా స్థానంలో జాతీయ టీ20 జట్టుకు ఎంపికవ్వడంతో ఇంగ్లాండ్ వన్డే కప్‌లో వార్విక్‌షైర్ బేర్స్ తరఫున ఆడే అవకాశాన్ని వదులుకుని ఆమె మళ్లీ ఇండియన్ టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. 

ఆసియా కప్ షెడ్యూల్, ఆసియా గేమ్స్ పోరు:

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30వ తేదీన థాయిలాండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 3వ తేదీన హాంకాంగ్, సెప్టెంబర్ 5న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌లతో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఆసియా గేమ్స్‌లో గతంలో శ్రీలంకపై గెలిచి స్వర్ణ పతకం సాధించిన ఇండియా, ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగబోతుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సారథ్యంలో షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, రేణుకా ఠాకూర్‌తో పాటు కొత్తగా జట్టులో చేరిన ప్రతికా రావల్ సత్తా చాటేందుకు రెడీ అవుతుంది.