- స్కీమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- 119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల యూనిట్లు పంపిణీ
- వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రయారిటీ
- వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. వంద శాతం సబ్సిడీతో బీసీ నిరుద్యోగ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనుంది. గురువారం సెక్రటేరియెట్‌లో ఈ స్కీమ్‌ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచే ప్రారంభమైందని, వచ్చే నెల 15 వరకు గడువు ఉంటుందని ఆయన వెల్లడించారు.
నియోజకవర్గానికి వెయ్యి చొప్పున..
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలని, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా వంద శాతం సబ్సిడీపై అందిస్తామని చెప్పారు. తొలి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని, భవిష్యత్తులో పథకాన్ని మరింత విస్తరిస్తామని తెలిపారు.
నిరుపేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, దివ్యాంగులు, కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని తెలిపారు. కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణ కూడా అందిస్తామని చెప్పారు.
ఎంపిక ఇలా..
మండల స్థాయి కమిటీకి ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ప్రతినిధులు, కలెక్టర్ నామినేట్ చేసిన వ్యక్తి, డీఆర్‌డీఏ ప్రతినిధితో కలిపి మొత్తం ఏడుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో 10 మంది అధికారులు సభ్యులుగా ఉంటారు. కలెక్టర్ ఆమోదించిన అర్హుల జాబితాను బీసీ సహకార సంస్థ ఎండీ ఆమోదించిన అనంతరం కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. కుట్టు మిషన్ల కొనుగోలు ప్రక్రియను కేంద్రీకృత టెండరింగ్ విధానంలో చేపట్టనున్నారు.
అర్హతలు ఇవీ..
- బీసీ నిరుద్యోగ మహిళ అయి ఉండాలి.
- 18 నుంచి 55 ఏండ్ల మధ్య వయసు ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో
- రూ.2 లక్షలకు మించకూడదు.
- ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు.
- అర్హులు టీజీఓబీఎంఎంఎస్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- సంబంధిత కమ్యూనిటీకి నిబంధనల మేరకు ప్రాధాన్యం ఉంటుంది.
