మూడేళ్ల చిన్నారి దక్షిత్ అరుదైన స్కేటింగ్ సాహస యాత్ర..మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కి.మీ ప్రయాణం

మూడేళ్ల చిన్నారి దక్షిత్ అరుదైన స్కేటింగ్ సాహస యాత్ర..మదనపల్లె నుంచి కదిరి వరకు 79 కి.మీ ప్రయాణం

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఓ మూడేళ్ల బుడతడు చరిత్ర సృష్టించేందుకు నడుం బిగించాడు. వయసులో చాలా చిన్నవాడైనప్పటికీ.. ఆలోచనలో, సాహసంలో ఎంతో పెద్ద లక్ష్యంతో ముందుకు కదిలాడు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. దేశభక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దక్షిత్ అరుదైన స్కేటింగ్ సాహస యాత్రకు శ్రీకారం చుట్టాడు. మదనపల్లె నుంచి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వరకు ఏకంగా 79 కిలోమీటర్ల దూరాన్ని స్కేటింగ్ చేస్తూ ప్రయాణాన్ని ప్రారంభించాడు.

కేవలం మూడేళ్ల ప్రాయంలోనే ఈ సాహసానికి పూనుకున్న దక్షిత్ ప్రతిభను చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ఈ చిన్నారికి మద్దతుగా నిలిచిన ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ (ITBP) బెటాలియన్ సిబ్బంది.. అతనికి ఘనంగా స్వాగతం పలికి మరింత ఉత్సాహపరిచారు.

ప్రారంభ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్కేటింగ్ క్రీడాకారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొని దక్షిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సాహస యాత్రను విజయవంతంగా పూర్తి చేసి, జాతీయ స్థాయిలో మన ప్రాంతానికి పేరు తెచ్చిపెట్టాలని అందరూ మనసారా ఆకాంక్షించారు.