గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు తిన్నారని... అందుకే వారికి పాపం తగిలి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. సంగారెడ్డి సభలో మాట్లాడిన సీఎం.. తనను ఆశీర్వదించడానికి మహిళలు నేను ఇచ్చిన పాలపిట్ట చీరలు కట్టుకుని వచ్చారని.. ఈ దసరాకు సారె కింద మహిళలకు చిలకపచ్చ చీరలు ఇస్తామని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం కేవలం 32 నెలల్లోనే ఏకంగా 32 వేల కోట్ల రూపాయలను చెల్లించామని, కేవలం ప్రయాణమే కాకుండా వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలనే ఓనర్లుగా చేశామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇంటి కోసమే ఎదురుచూస్తున్న నిరుపేద ఆడబిడ్డల కోసం ఏకంగా 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను వారి పేరుతోనే మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు రాలేదు కానీ... కేసీఆర్‌కు మాత్రం వంద ఎకరాల పొలం వచ్చిందని సెటైర్లు వేశారు. గత పదేళ్లలో పేదలపై సోయి లేని పాలకులకు భిన్నంగా... నేడే ఏకంగా రెండున్నర లక్షల కొత్త పెన్షన్లను మంజూరు చేశామని తెలిపారు.
