మాకొద్దు బీమా పాలసీలు.. విపరీతంగా పెరుగుతున్న సరెండర్లు

మాకొద్దు బీమా పాలసీలు.. విపరీతంగా పెరుగుతున్న సరెండర్లు
  • మొదటి రెండేళ్లలోనే ఎక్కువ
  • డబ్బు లేకపోవడమే ముఖ్య కారణం
  • పాలసీలు అంటగట్టడంతోనూ సమస్య

న్యూఢిల్లీ: బీమా పాలసీలను వెనక్కి తీసుకునే వారి సంఖ్య  ఏటా పెరుగుతూనే ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి జీవిత బీమా కంపెనీల సరెండర్, విత్‌‌‌‌డ్రాయల్ చెల్లింపుల విలువ రూ.2.80 లక్షల కోట్లకు చేరింది. 2022లో ఈ విలువ రూ.1.58 లక్షల కోట్లు ఉండేది. మొత్తం చెల్లింపులలో వీటి వాటాలు 32 శాతం నుంచి 39 శాతానికి చేరాయి. ఇదే సమయంలో మెచ్యూరిటీ పేమెంట్ల వాటా 2022లోని 48 శాతం నుంచి 2026 నాటికి 37 శాతానికి పడిపోయింది. 2023, 2024, 2026 సంవత్సరాలలో మెచ్యూరిటీ ప్రయోజనాల కంటే, సరెండర్ చెల్లింపులే ఎక్కువగా ఉన్నాయి. ప్రీమియంల చెల్లింపు సామర్థ్యం, ఆర్థిక పరిస్థితులలో మార్పులు, తప్పుదారి పట్టించే అమ్మకాలు వంటి కారణాల వల్ల తొలి దశలోనే చాలా మంది పాలసీలను వదులుకుంటున్నట్టు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌‌‌‌డీఏఐ గుర్తించింది.

తొలి దశలోనే వెనకడుగు

పాలసీ తీసుకున్న తొలి 13 నుంచి 24 నెలల కాలంలోనే అత్యధికంగా సరెండర్లు జరుగుతున్నాయని ట్యాక్స్​ ఎక్స్​పర్ట్​ కృతికా శర్మ తెలిపారు. 2024–-25 సంవత్సరాల మధ్య సరెండర్ విలువ నిబంధనలలో వచ్చిన మార్పుల వల్ల పాలసీల నుంచి తొందరగా బయటకు వెళ్లడం కస్టమర్లకు సులభమైంది. మొదటిసారి కొనుగోలు చేసే కొందరు కస్టమర్లకు దీర్ఘకాలిక బీమా ప్రాధాన్యం గురించి పూర్తిగా తెలియడం లేదని ఆమె వివరించారు.

అన్ని పాలసీల్లోనూ సరెండర్లు

 ఫలానా బీమా పాలసీలో మాత్రమే అత్యధిక సరెండర్ రేటు ఉందని చెప్పడానికి తగిన ఆధారం లేదని కృతిక స్పష్టం చేశారు. అన్ని రకాల బీమా ప్లాన్లలోనూ పాలసీదారులు మధ్యలోనే బయటకు వచ్చేస్తున్నారు. కస్టమర్ ఆదాయానికి,  అవసరాలకు, ఆర్థిక లక్ష్యాలకు పాలసీ సరిపోతుందా లేదా ? అనేదే ముఖ్యమని స్పష్టం చేశారు. కంపెనీలు పాలసీలు తీసుకునేటప్పుడు చూపే శ్రద్ధ, తరువాత ఉండకపోవడంతో సరెండర్లు పెరుగుతున్నాయని కృతిక అన్నారు.

నిబంధనలపై అవగాహన తక్కువే..

రూల్స్​ ప్రకారం జీవిత బీమా సంస్థలు ఉత్పత్తుల సమగ్రతను అంచనా వేయాలి. అంటే.. ఏ బీమా పాలసీ  నిజంగా అవసరమో, వారి ఆర్థిక పరిస్థితి, ఆదాయం, వయస్సు, కుటుంబ లక్ష్యాలకు అది సరిగ్గా సరిపోతుందో లేదో చెప్పాలి. సంవత్సరాల వారీగా గ్యారెంటీడ్ సరెండర్ విలువలను వెల్లడించాలి. పాలసీ జారీ తర్వాత 30 రోజుల ఫ్రీ- లుక్ పీరియడ్ ఉంటుంది.  నచ్చకపోతే పాలసీ నుంచి బయటకు రావొచ్చు. రూల్స్ ​ఇలా ఉన్నప్పటికీ పాలసీలు అంటగడుతున్నారంటూ (మిస్​సెల్లింగ్​) ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి.  

 ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి

తొలినాళ్లలో పాలసీలను సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియం కంటే చాలా తక్కువ మొత్తమే చేతికి వస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో (యూలిప్ పాలసీలు) ఐదేళ్ల  లాక్- ఇన్ పీరియడ్ ముగిసే వరకు డబ్బులు వెనక్కి తీసుకోవడం కుదరదు. తాత్కాలిక ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు పాలసీని నేరుగా సరెండర్ చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. పాలసీని పెయిడప్ రూపంలో మార్చడం, పాలసీ మీద లోన్ తీసుకోవడం, ప్రీమియం చెల్లింపు పద్ధతులను మార్చడం వంటివి చేయవచ్చు. సరెండర్ చేసి మళ్లీ కొత్త పాలసీ తీసుకోవడం వల్ల లాభం ఉండదు. వయస్సు పెరిగినందున ప్రీమియం భారం పెరుగుతుంది. పెయిడప్​ పద్ధతిలో అయితే పాలసీ పూర్తిగా రద్దు కాదు. అప్పటికే చెల్లించిన ప్రీమియంల సంఖ్య ఆధారంగా పాలసీ బీమా మొత్తాన్ని (సమ్ అష్యూర్డ్) నిష్పత్తిలో తగ్గిస్తారు.  పాలసీ మెచ్యూరిటీ అయ్యాక ఆ తగ్గించిన బీమా మొత్తం లభిస్తుంది. దీనివల్ల పాలసీని పూర్తిగా సరెండర్ చేసి నష్టపోకుండా కొంత రక్షణ పొందవచ్చు.