- హ్యామ్ రోడ్ల పైలాన్ ఆవిష్కరణ, పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- అనంతరం పరకాలలో బహిరంగ సభ
హనుమకొండ/ములుగు, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూతురి వివాహానికి హాజరు కానున్న సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ములుగు జిల్లా మేడారం వన దేవతల సన్నిధికి చేరుకుంటారు.
సమ్మక్క, --సారలమ్మను దర్శించుకున్న అనంతరం 2.25 గంటలకు ములుగు గట్టమ్మ టెంపుల్ కు రానున్నారు. అక్కడ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం ములుగు కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు.
పరకాలలో బహిరంగ సభ
ములుగు నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రానికి సీఎం చేరుకుంటారు. అక్కడ హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, కుంకుమేశ్వర ఆలయ అభివృద్ధి, షాదీఖానా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు ఫోర్ లైన్ రోడ్డు, నూతన డీఈ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు.
అనంతరం పరకాల అంగడి స్థలంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరిగి హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందుుల తలెత్తకుండా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
