Sundeep Kishan: నా జోలికి వస్తే మీ బండారం బయటపెడుతా.. సందీప్ కిషన్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి..?

Sundeep Kishan: నా జోలికి వస్తే మీ బండారం బయటపెడుతా.. సందీప్ కిషన్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి..?

టాలీవుడ్‌లో ఈ మధ్య సినిమాల కంటే.. వాటి చుట్టూ జరిగే సోషల్ మీడియా వార్‌ ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు అదే తరహాలో హీరో సందీప్ కిషన్ నటించిన ‘సిగ్మా’ మూవీ చుట్టూ కూడా ఓ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్‌కు ముందు సందీప్ కిషన్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

తన సినిమాను టార్గెట్ చేస్తూ కొంతకాలంగా కావాలనే నెగెటివ్ ట్వీట్లు చేస్తున్నారని సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారో, దీనికి ఎవరు డబ్బులు పెడుతున్నారో తనకు తెలుసంటూ ఆయన చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని పెంచాయి.

నా జోలికి వస్తే మీ బండారం బయట పెడుతా..: సందీప్ కిషన్

‘నేను టార్గెట్ అవుతున్నాను.. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి’ అనే రేంజ్‌లో సందీప్ చేసిన వార్నింగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా “గత కొన్ని రోజులుగా నాకూ, నా సినిమాకూ వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ట్వీట్లు చాలానే కనిపిస్తున్నాయి. దీని వెనుక ఉన్నవాళ్లు ఎవరో, దీని కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నది ఎవరో నాకు బాగా తెలుసు.. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇందులో నష్టపోయేది నాకంటే మీరే ఎక్కువ. అదే గనుక నేరుగా రంగంలోకి దిగితే అందరూ దొరికిపోతారు.. కాస్త చూసుకోండి ” అంటూ హీరో సందీప్ కిషన్ చేసిన కామెంట్‌తో అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ మొదలైంది.

అయితే సందీప్ కిషన్ తన ట్వీట్‌లో ఎక్కడా ఎవరి పేరును ప్రస్తావించలేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై ఓ టాలీవుడ్ సినీ క్రిటిక్ చేసినట్టు ప్రచారంలో ఉన్న మరో ట్వీట్ కూడా చర్చకు దారితీసింది.

“మేకను కుక్కగా మార్చిన నలుగురు తెలివైన వారి కథ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలో అదే జరుగుతోంది. చేయగలిగితే యుద్ధం చేయాలి.. లేదంటే లేదు.. బాధపడి ప్రయోజనం లేదు” అంటూ చేసిన ఈ వ్యాఖ్యలను పలువురు ‘సిగ్మా’ వివాదంతో లింక్ చేస్తున్నారు. అయితే ఆ ట్వీట్ నేరుగా సందీప్ కిషన్‌ను ఉద్దేశించిందేనా అన్నదానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.

ట్వీట్ వార్‌కి బ్రేక్.. ‘సిగ్మా’కు పాజిటివ్ టాక్!

ఇక సోషల్ మీడియాలో వివాదం ఒకవైపు నడుస్తుండగానే.. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మరోలా ఉంది. ‘సిగ్మా’ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌లో సందీప్ కిషన్ పెర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది.

సందీప్ కిషన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం, స్క్రీన్‌పై చూపించిన యాటిట్యూడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమాకు ఎస్. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్లస్ పాయింట్ అంటూ మ్యూజిక్‌పై కూడా ప్రశంసలు కనిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్‌కి థమన్ ఇచ్చిన స్కోర్ బాగా ఎలివేట్ చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సందీప్ కిషన్ ఈ మధ్య కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తున్నాడంటూ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో రిలీజ్‌కు ముందు నెగెటివ్ ప్రచారం అంటూ మొదలైన చర్చ.. ఇప్పుడు సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్‌తో మరో మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది.

అసలు ఈ ‘ట్వీట్ వార్’ వెనుక కథేంటి?

ఓవైపు సందీప్ కిషన్ చేసిన స్ట్రాంగ్ కామెంట్స్.. మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కౌంటర్ ట్వీట్.. ఇంకోవైపు థియేటర్ల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్.. ఇవన్నీ కలిపి ‘సిగ్మా’ చుట్టూ క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అసలు సందీప్ కిషన్ చెప్పినట్టుగా ‘టార్గెటెడ్’ క్యాంపెయిన్ వెనుక ఎవరున్నారు? ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వార్నింగ్ ఇచ్చారు? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది.

ఈ విషయంపై సందీప్ నుంచి మరింత క్లారిటీ వస్తుందా? లేక ఈ ట్వీట్ వార్ ఇక్కడితో ఆగిపోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మాత్రం వివాదంతో వచ్చిన బజ్‌కి తోడు.. ‘సిగ్మా’కు వస్తున్న పాజిటివ్ టాక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ టాక్ రానున్న రోజుల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.