ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో కొత్త రకం రాబరీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు డేటా చోరి చేసో, వెబ్ సైట్ హ్యాకింగ్ చేసో, లేక ఆన్ లైన్ డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు..కొత్త రకం దోపిడీకి తెరలేపారు. ఇది ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లే టార్గెట్ గా ఈ చోరీలు జరుగుతున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీ దొంగలు ప్రత్యక్షంగా ఇండ్లలో చొరబడి తీవ్రంగా దాడి చేసి తమ అకౌంట్లో ఉన్న క్రిప్టో కరెన్సీని దోచుకుంటున్నారు. ఓ ఇంట్లో చొరబడి నిండు గర్భిణీ అయిన భార్యను, కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తామని బెదిరించి ఓ వ్యాపారి అకౌంట్లో ఉన్న క్రిప్టో కరెన్సీని దోపిడి దొంగలు తమ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్న ఈ విచిత రాబరీ గురించి వివరాల్లోకి వెళితే..
బ్రిటన్‌లో క్రిప్టోకరెన్సీ కోసం దుండగులు ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడి దారుణంగా దాడి చేశారు. సాలిహల్‌లో జరిగిన ఈ ఘటనలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు వ్యాపారిని సుత్తెలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా ఏడు నెలల గర్భిణీ అయిన వ్యాపారి భార్యను బంధించి, క్రిప్టోకరెన్సీ ఇవ్వకపోతే ఆమె కడుపులోని బిడ్డను చంపేస్తామని బెదిరించారు.
బాధితులను సాలిహాల్ కు చెందిన జేమ్స్, అతని భార్యగా గుర్తించారు. దుండగులు సుమారు 45 నిమిషాల పాటు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. ముఖం, తల, పక్కటెముకలపై సుత్తెలతో దాడి చేశారు. మరో వ్యక్తి అతని భార్య ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేశాడని జేమ్స్ చెప్పారు.
అనంతరం దుండగులు జేమ్స్ ఫోన్‌ను తీసుకుని క్రిప్టో వాలెట్‌లోని డబ్బును బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. వారు వీడియో కాల్‌లో ఉన్న మరో వ్యక్తి సూచనలతో వ్యవహరించినట్లు బాధితుడు తెలిపారు. భార్య, పుట్టబోయే బిడ్డను చంపేస్తామని బెదిరించడంతో జేమ్స్ వందల వేల పౌండ్ల విలువైన క్రిప్టోను ఆ వ్యక్తి డిజిటల్ వాలెట్‌కు బదిలీ చేశారు. దుండగులు జేమ్స్ ఇంట్లో ఉన్న ఖరీదైన రోలెక్స్ వాచీలను కూడా దోచుకెళ్లారు.మన దేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోనప్పటికీ ఇటీవల బ్రిటన్ లాంటి దేశాల్లో ఈ తరహా రాబరీలు సాధారణం అయ్యాయి.
ఈ ఘటనను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందించిన వారికి క్రైమ్‌స్టాపర్స్ సంస్థ 10 వేల పౌండ్ల రివార్డు ప్రకటించింది. క్రిప్టో ఇన్వెస్టర్లు లక్ష్యంగా చేసుకుని భౌతికంగా దాడి చేసి ఆస్తులను బదిలీ చేయించుకునే ఘటనలను ‘వ్రెంచ్ అటాక్స్’గా పిలుస్తున్నారు.క్రిప్టోకరెన్సీ ,బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌లను విశ్లేషించే ప్రముఖ అమెరికన్ డేటా ప్లాట్‌ఫారమ్ సంస్థ చైనాలిసిస్ ప్రకారం 2026లో జూన్ వరకు ఇలాంటి హింసాత్మక దాడుల్లో సుమారు 30 మిలియన్ డాలర్ల క్రిప్టో దోచుకున్నట్లు సమాచారం.
